T20 WC 2022 IND VS ZIM: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్‌ కుమార్‌

7 Nov, 2022 15:59 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా నిన్న (నవంబర్‌ 6) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్వింగ్‌ సుల్తాన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్‌ ఓవర్లు (10) సంధించిన బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన భువీ.. ఆ ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మొయిడిన్‌ చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మెయిడిన్‌ ఓవర్ల రికార్డును సహచరుడు జస్ప్రీత్‌ బుమ్రాతో కలిసి షేర్‌ చేసుకున్న భువీ.. తాజాగా ఈ అరుదైన రికార్డను తన పేరిట లఖించుకున్నాడు. 

ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక మెయిడిన్‌ ఓవర్ల రికార్డు విండీస్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ పేరటి ఉం‍ది. నరైన్‌ టీ20ల్లో మొత్తం 27 మెయిడిన్‌ ఓవర్లు బౌల్‌ చేశాడు. అతని తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఉన్నాడు. షకీబ్‌ ఖాతాలో 23 మెయిడిన్ ఓవర్లు ఉన్నాయి. వీరి తర్వాత విండీస్‌ లెగ్‌ స్పిన్నర్‌ శ్యాముల్‌ బద్రీ (21), భువనేశ్వర్‌ కుమార్‌ (21) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా 19 మెయిడిన్లతో ఆరో ప్లేస్‌లో ఉన్నాడు.

ఇదిలా ఉంటే, నిన్న జింబాబ్వేపై గెలుపుతో టీమిండియా గ్రూప్‌-2లో అగ్రస్థానంతో సెమీస్‌కు చేరుకుంది. ఈ గ్రూప్‌ నుంచి సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా పాక్‌ నిలిచింది. అటు గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. నవంబర్‌ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్‌ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన జట్ల మధ్య నవంబర్‌ 13న ఫైనల్‌ జరుగుతుంది.

Poll
Loading...
మరిన్ని వార్తలు