T20 WC Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై టీమిండియా విజయం.. సెమీస్‌ బెర్త్‌ ఖాయం..!

3 Nov, 2022 07:12 IST|Sakshi

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠను ఎదుర్కొన్న భారత ఆటగాళ్లు, అభిమానులకు ఈసారి బంగ్లాదేశ్‌ జట్టు దాదాపు అలాంటి అనుభవాన్నే ఇచ్చింది. ఒకదశలో మన జట్టు ఓటమి దశగా వెళుతున్నట్లు అనిపించింది కూడా. అయితే చివరకు టీమిండియా సరైన సమయంలో పంచ్‌ విసిరి ఆటను మలుపు తిప్పింది. కీలక దశలో వరుణదేవుడు కాస్త అడ్డుగా నిలిచి బంగ్లాదేశ్‌ జోరుకు బ్రేకులు వేయగా... ఆట మొదలైన తర్వాత రోహిత్‌ సేన ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంది. ఫలితంగా ప్రపంచకప్‌లో సంచలనానికి అవకాశం లేకుండా చేసింది.  

బంగ్లాదేశ్‌ లక్ష్యం 185 పరుగులు... 7 ఓవర్లలో 66/0...లిటన్‌ దాస్‌ చెలరేగిపోతున్నాడు. అయితే వర్షం రావడంతో డక్‌వర్త్‌–లూయిస్‌ సీన్‌లోకి వచ్చేసింది. ఆ సమయానికి బంగ్లా 17 పరుగులు ముందంజలో ఉంది. వాన కొనసాగి ఇంకా ఆట సాధ్యంకాకపోయుంటే భారత్‌ ఓడిపోయేదే! కానీ వాన ఆగి ఆట మళ్లీ మొదలైంది. బంగ్లాదేశ్‌ లక్ష్యం 16 ఓవర్లలో 151 పరుగులుగా మారింది... అంటే మిగిలిన 54 బంతుల్లో 85 పరుగులు, చేతిలో 10 వికెట్లు... ఎలా చూసినా బంగ్లాదే పైచేయి. కానీ రెండో బంతికే లిటన్‌ దాస్‌ను అద్భుతంగా రనౌట్‌ చేసిన టీమిండియా మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకుంది. చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టి సెమీస్‌లో స్థానం దాదాపు ఖాయం చేసుకుంది.    

అడిలైడ్‌: టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు మరింత చేరువైంది. నాలుగు మ్యాచ్‌లలో మూడో విజయంతో గ్రూప్‌–2లో అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (44 బంతుల్లో 64 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), కేఎల్‌ రాహుల్‌ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (16 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించాడు.  హసన్‌ మహమూద్‌కు 3 వికెట్లు లభించాయి. అనంతరం మ్యాచ్‌కు వాన అంతరాయం కలిగించడంతో బంగ్లాదేశ్‌ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులుగా నిర్దేశించారు.

బంగ్లా 16 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులే చేయగలిగింది. లిటన్‌ దాస్‌ (27 బంతుల్లో 60; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం వృథా అయింది. హార్దిక్, అర్‌‡్షదీప్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారత్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆదివారం జింబాబ్వేతో తలపడుతుంది.  
రాహుల్‌ దూకుడు... 
ఎట్టకేలకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నమ్మకాన్ని ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ నిలబెట్టుకున్నాడు. మూడు వరుస వైఫల్యాల తర్వాత దూకుడైన బ్యాటింగ్‌తో అతను ఆకట్టుకున్నాడు. 1 పరుగు వద్ద హసన్‌ సునాయాస క్యాచ్‌ వదిలేసినా దానిని వాడుకోలేక రోహిత్‌ శర్మ (2) విఫలమయ్యాడు. అయితే హసన్‌ ఓవర్లో వరుసగా 4, 6తో రాహుల్‌ జోరు పెంచగా, మరో ఎండ్‌లో కోహ్లి జత కలిశాడు. పవర్‌ప్లేలో భారత్‌ 37 పరుగులు చేసింది. షరీఫుల్‌ వేసిన ఓవర్లో రాహుల్‌ చెలరేగాడు.

అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదగా, అదే ఓవర్లో కోహ్లి మరో ఫోర్‌ కొట్టడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్‌ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. హసన్‌ ఓవర్లో 3 ఫోర్లతో సూర్య కూడా ధాటిని ప్రదర్శించాడు. సూర్య అవుటైన తర్వాత కోహ్లి వేగం పెంచాడు. 14వ ఓవర్‌ ముగిసేసరికి 28 బంతుల్లో 32 పరుగులు చేసిన కోహ్లి, మరో 16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో  32 పరుగులు జోడించడం విశేషం. 37 బంతుల్లో అతను హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. హార్దిక్‌ (5), దినేశ్‌ కార్తీక్‌ (7), అక్షర్‌ పటేల్‌ (7) విఫలమైనా, కోహ్లి క్రీజ్‌లో ఉండటంతో భారత్‌ మెరుగైన స్కోరు సాధించగలిగింది. చివరి ఓవర్లో అశ్విన్‌ (13 నాటౌట్‌) ఒక సిక్స్, ఫోర్‌ కొట్టాడు.  
చెలరేగిన బౌలర్లు... 
వర్షం కారణంగా దాదాపు 45 నిమిషాల పాటు ఆట ఆగిపోగా, ఆ తర్వాత ఆట మళ్లీ మొదలయ్యాక బంగ్లా రాత మారిపోయింది. రెండో బంతికే దాస్‌ రనౌట్‌ కావడంతో పరిస్థితి తలకిందులైంది. ఇతర బ్యాటర్లలో ఎవరూ నిలబడలేకపోగా, భారత జట్టు చక్కటి ఫీల్డింగ్‌తో బంగ్లాను నిలువరించేసింది. ఫలితంగా 33 బంతుల వ్యవధిలో 40 పరుగులు మాత్రమే చేసిన బంగ్లా 6 వికెట్లు (దాస్‌ వికెట్‌తో సహా) చేజార్చుకుంది.

అర్ష్‌దీప్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో దెబ్బ కొట్టాడు. సూర్య, దీపక్‌ హుడా సూపర్‌ క్యాచ్‌లతో బంగ్లా బ్యాటర్లను వెనక్కి పంపారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో మరో రెండు వికెట్లతో హార్దిక్‌ కూడా చెలరేగాడు. ఏడో వికెట్‌కు నూరుల్‌ హసన్‌ (14 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), తస్కీన్‌ (12 నాటౌట్‌) కలిసి 19 బంతుల్లోనే 37 పరుగులు జోడించి గెలిపించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. 

చివరి ఓవర్లో... 
బంగ్లా విజయానికి ఆఖరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా, అర్‌‡్షదీప్‌ యార్కర్లతో కట్టడి చేయగలిగాడు. తొలి బంతికి సింగిల్‌ వచ్చాక 5 బంతుల్లో 19 పరుగులు చేయాల్సిన సమయంలో నూరుల్‌ పోరాడాడు. రెండో బంతికి భారీ సిక్స్‌ కొట్టిన అతను మూడో బంతికి సింగిల్‌ అవకాశం ఉన్నా స్ట్రయికింగ్‌ కోల్పోకుండా ఉండేందుకు పరుగు తీయలేదు. తర్వాతి రెండు బంతుల్లో 2, 4 కొట్టిన అతను ఉత్కంఠను పెంచాడు. చివరి బంతికి సిక్స్‌ కొడితే స్కోరు సమమయ్యే స్థితిలో భారీ షాట్‌కు ప్రయత్నించిన నూరుల్‌కు సింగిల్‌ మాత్రమే దక్కింది. దాంతో బంగ్లా అభిమానుల గుండె పగలగా, రోహిత్‌ సేన హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. 

మెరుపు ఇన్నింగ్స్‌... 
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో లిటన్‌ దాస్‌ ఆటనే హైలైట్‌గా నిలిచింది. లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచి అతను విరుచుకుపడ్డాడు. అర్‌‡్షదీప్‌ తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన అతను, భువనేశ్వర్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదాడు. 27 పరుగుల వద్ద దాస్‌ ఇచ్చిన కష్టసాధ్యమైన క్యాచ్‌ను దినేశ్‌ కార్తీక్‌ అందుకోలేకపోయాడు.

షమీ ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్‌ కొట్టిన దాస్‌ 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కవర్‌డ్రైవ్, పుల్, వికెట్ల వెనక సిక్సర్లతో అన్ని రకాల షాట్లు ఆడిన దాస్‌ను నిలువరించేందుకు రోహిత్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దాస్‌ జోరుతో పవర్‌ప్లేలో 60 పరుగులు చేసిన బంగ్లా 7 ఓవర్లు ముగిసేసరికి 66/0తో పటిష్ట స్థితిలో నిలిచింది.   

ఆ రనౌట్‌తో... 
రాహుల్‌కు బుధవారం కలిసొచ్చింది. విమర్శలకు సమాధానమిస్తూ బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ చేసిన అతను ఫీల్డింగ్‌లో అద్భుత త్రో విసిరి ఆట దిశను మార్చాడు. వాన ఆగిన తర్వాత వేసిన రెండో బంతికి లిటన్‌ దాస్‌ రనౌట్‌ కావడం బంగ్లా పతనానికి దారి తీసింది. అశ్విన్‌ బౌలింగ్‌లో నజ్ముల్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా ఆడగా సింగిల్‌ సులువుగా పూర్తయింది.

అయితే బ్యాటర్లు రెండో పరుగు తీస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన రాహుల్‌ డైరెక్ట్‌ త్రో నాన్‌ స్ట్రయికింగ్‌ ఎండ్‌లో వికెట్లను పడగొట్టడంతో దాస్‌ నిరాశగా వెనుదిరిగాడు. అంతకుముందు బంతికే సింగిల్‌ తీస్తూ జారిపడి నొప్పికి చికిత్స తీసుకొన్న దాస్‌ ఈసారి రెండో పరుగు తీసే సాహసం చేశాడు. చివరకు అదే బంగ్లా ఓటమికి బాటలు వేసింది.   

Poll
Loading...
మరిన్ని వార్తలు