T20 WC 2022: ఆసక్తికరంగా మారిన గ్రూప్-2 సెమీస్‌ బెర్తు.. 

2 Nov, 2022 21:18 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో సూపర్‌-12 ఆరంభంలో ఎవరు సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకుంటారన్న విషయంలో కొంచెం క్లారిటీ ఉండేది. అయితే వరుణుడు ఈ ప్రపంచకప్‌కు అడ్డుగా మారడం కొన్ని జట్లకు శాపంగా మారింది. తాజాగా మ్యాచ్‌లు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో సెమీస్‌ బెర్తులు ఆసక్తికరంగా మారాయి. గ్రూప్-1లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గ్రూఫ్‌ ఆఫ్‌ డెత్‌గా ఉన్న  ఆ గ్రూఫ్‌లో ఎవరు సెమీస్‌ చేరతారన్నది చెప్పడం కష్టమే.

తాజాగా గ్రూప్-2లోనూ అదే పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్‌పై విజయంతో టీమిండియా సెమీస్‌ రేసుకు దగ్గరైనా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గ్రూఫ్‌లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లు సెమీస్‌ రేసుకు పోటీ పడుతున్నాయి. వీటిలో పాకిస్తాన్‌కు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ టి20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరిగేది ఎవరు చెప్పలేరు. ఇక గ్రూప్-2 నుంచి భారత్‌ సహా ఏ జట్లకు సెమీస్‌ అవకాశాలున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

టీమిండియా:


ఇప్పటికైతే టీమిండియా సేఫ్‌ జోన్‌లోనే ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో ఆరు పాయింట్లతో గ్రూఫ్‌లో అగ్రస్థానంలో ఉంది. నవంబర్‌ 6న జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే ఎవరితో సంబంధం లేకుండా గ్రూఫ్‌ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టనుంది. ఒకవేళ జింబాబ్వే చేతిలో ఓడినా నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండడంతో పెద్దగా నష్టం లేదు. కానీ దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది. ఇక్కడ మరొక అంశమేమిటంటే భారత్‌, జింబాబ్వే మ్యాచ్‌ సూపర్‌-12 దశలో ఆఖరి మ్యాచ్‌. దీంతో టీమిండియాకు అప్పటికే ఒక స్పష్టత రానుంది.

దక్షిణాఫ్రికా:

టీమిండియాపై విజయంతో రేసులోకి వచ్చిన దక్షిణాఫ్రికా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక రద్దు వల్ల ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ప్రొటిస్‌ జట్టు తన తర్వాతి రెండు మ్యాచ్‌లు పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి గెలిచినా ఏడు పాయింట్లతో సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ రెండింట్లో ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఫామ్‌ దృశ్యా దక్షిణాఫ్రికాను ఓడించడం అంత సులువు కాదు. కానీ దక్షిణాఫ్రికాకు కీలక సమయంలో ఒత్తిడిని నెత్తి మీదకు తెచ్చుకొని అనూహ్యంగా టోర్నీ నుంచి వైదొలిగిన సందర్భాలు ఉన్నాయి.

బంగ్లాదేశ్‌:

టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంతో గ్రూఫ్‌-2లో మూడో స్థానంలో ఉంది బంగ్లాదేశ్‌. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ఉన్న బంగ్లా తన చివరి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో తలపడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధిస్తే సెమీస్‌ అవకాశాలున్నప్పటికి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదే పాక్‌ గెలిస్తే మాత్రం బంగ్లా ఇంటిదారి పట్టనుంది.

పాకిస్తాన్‌:

టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమిపాలైన పాకిస్తాన్‌కు కలిసిరావడం లేదు. జింబాబ్వేతో మ్యాచ్‌లోనూ అనూహ్యంగా ఓటమి పాలైన పాకిస్తాన్‌ నెదర్లాండ్స్‌పై కష్టపడి గెలిచింది. ఇప్పటివరకు ఆడిన మూడు ‍మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు ఓటములు చవిచూసింది. తన చివరి రెండు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో ఆడనుంది. ఈ రెండింటిలో గెలిస్తేనే పాక్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే.

జింబాబ్వే, నెదర్లాండ్స్‌:

ఈ రెండు జట్లకు పెద్దగా సెమీస్‌ అవకాశాలు లేనట్లే. అయితే టీమిండియాతో జింబాబ్వే.. దక్షిణాఫ్రికాతో నెదర్లాండ్స్‌ తమ చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి. టోర్నీలో తమకు చివరి మ్యాచ్‌ కదా అని రెచ్చిపోయి ఆడి ఆయా జట్లను ఓడించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే టి20ల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. అయితే  ఈ రెండు జట్లు అద్భుతాలు చేసి గెలిచినా సెమీస్‌ చేరవు కానీ ఇతర జట్ల ఫలితాలపై స్పష్టమైన ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

చదవండి: IND Vs BAN: పదే పదే మైదానంలోకి.. టీమిండియాతో ఉన్న సంబంధం?

Ind Vs Ban: వర్షం రాకపోయుంటే.. టీమిండియా గెలిచేదా!

మరిన్ని వార్తలు