WC 2022: వరల్డ్‌ నెం.1 బౌలర్‌గా ఎదుగుతాడు! ప్లీజ్‌ చేతన్‌ అతడిని సెలక్ట్‌ చేయవా!

5 Aug, 2022 10:59 IST|Sakshi
క్రిష్ణమాచారి శ్రీకాంత్‌

T20 World Cup 2022: టీమిండియా యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై భారత మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచంలోనే నంబర్‌ 1 బౌలర్‌గా ఎదిగే సత్తా అతడికి ఉందని కొనియాడాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి అతడిని తప్పక ఎంపిక చేయాలని టీమిండియా సెలక్టర్లకు సూచించాడు. 

కాగా 23 ఏళ్ల అర్ష్‌దీప్‌ ఐపీఎల్‌-2022లో రాణించిన విషయం తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో క్రికెట్‌ దిగ్గజాల చేత ప్రశంసలు అందుకున్న ఈ ఫాస్ట్‌బౌలర్‌.. అనతికాలంలోనే బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్నాడు.


అర్ష్‌దీప్‌ అరంగేట్రం(PC: BCCI)

ఈ క్రమంలో ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌-2022 నేపథ్యంలో టీమిండియా పలు ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు సహా యువ బౌలర్లను పరీక్షిస్తోంది.

భువీని కాదని.. వాళ్లిద్దరి చేత!
ఇందులో భాగంగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. రెండో టీ20లో సీనియర్‌ పేసర్‌, డెత్‌ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్‌ కుమార్‌ను కాదని అర్ష్‌దీప్‌, ఆవేశ్‌ ఖాన్‌లకు బంతిని ఇచ్చాడు. మెగా టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో యువకులకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపాడు. ఇక ఆవేశ్‌తో పోలిస్తే అర్ష్‌దీప్‌ ఇప్పటి వరకు మెరుగైన ప్రదర్శనతో అతడి కంటే ఓ అడుగు ముందే ఉన్నాడు.

ప్లీజ్‌.. చేతు!
ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌.. అర్ష్‌దీప్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 ఫార్మాట్‌లో భవిష్యత్‌ కాలంలో వరల్డ్‌ నెంబర్‌ 1 బౌలర్‌గా ఎదగగలడు. తనొక అద్బుతం అంతే! అర్ష్‌దీప్‌ సింగ్‌.. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. టీ20 ప్రపంచకప్‌ భారత జట్టులో అతడు ఉంటాడు. కమాన్‌ చేతు.. ప్లీజ్‌ అర్ష్‌దీప్‌ పేరును పరిగణనలోకి తీసుకో’’ అంటూ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మకు విజ్ఞప్తి చేశాడు.

కాగా అర్ష్‌దీప్‌ ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పటికే విండీస్‌తో సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న రోహిత్‌ సేన అమెరికా వేదికగా శని, ఆదివారాల్లో జరుగనున్న చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచి ట్రోఫీ సొంత చేసుకోవాలని భావిస్తోంది.
చదవండి: Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్‌​ కుమారుడు
NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్‌ బ్యాటర్‌..

మరిన్ని వార్తలు