IND Vs PAK: అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఆ భయాలేమి అక్కర్లేదట!

22 Oct, 2022 13:44 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం(అక్టోబర్‌ 23న) చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే మ్యాచ్‌కు టికెట్లన్నీ ఎప్పుడో అమ్ముడయ్యాయి. 90వేలకు పైగా సామర్థ్యం ఉన్న మెల్‌బోర్న్ స్టేడియం అభిమానుల అరుపులతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే మ్యాచ్‌కు వర్షం పెద్ద ఆటంకంగా ఉంది. భారత్‌, పాక్‌ మ్యాచ్‌ జరగనున్న ఆదివారం మెల్‌బోర్న్‌లో వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయంటూ గతంలో ఆస్ట్రేలియా వాతావరణ విభాగం అంచనా వేసిన సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు అభిమానుల్లో ఎక్కువైపోయాయి.

ఈ నేపథ్యంలోనే వరుణ దేవుడు అభిమానుల మొర ఆలకించినట్లున్నాడు. శనివారం ఉదయం నుంచి మెల్‌బోర్న్‌లో వర్షం పడలేదని.. వాతావరణం సాధారణంగా ఉందంటూ ఆస్ట్రేలియా వాతావారణ విభాగం స్టేడియానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్‌ చేసింది . సోమవారం వరకు వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే వర్షం ముప్పు పూర్తిగా తొలిగిపోలేదని.. 40 శాతం మేర వర్షం పడే అవకాశముందని తెలిపింది.

అసలు మ్యాచ్‌ జరుగుతుందో లేదో అన్న సంశయంలో ఉన్న భారత్‌-పాక్‌ అభిమానులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌ అనే చెప్పొచ్చు. ఒకవేళ రేపు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించినా.. కనీసం ఐదు ఓవర్ల ఆట సాధ్యపడే అవకాశం ఉంది. దీంతో అభిమానులు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఎలాగైనా మ్యాచ్‌ జరిగేలా చూడాలని వరుణ దేవుడికి పూజలు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''ఇన్నాళ్లు మ్యాచ్‌ గెలవాలని కోరుకుంటూ పూజలు చేయడం చూశాం.. ఇప్పుడేమో మ్యాచ్‌ జరిగేలా చూడాలని పూజలు చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ'' మరికొంతమంది పేర్కొన్నారు.

చదవండి: కోహ్లి, రోహిత్‌ల భజన తప్ప సూర్య గురించి అడగడం లేదు!

విండీస్‌ జట్టుకు పోస్టుమార్టం​ జరగాల్సిందే..!

మరిన్ని వార్తలు