T20 WC 2022: హుడా, పటేల్‌ స్థానంలో నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్‌ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్‌.. కానీ ఏం లాభం?

13 Sep, 2022 10:56 IST|Sakshi

T20 World Cup 2022- India Squad: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ పెదవి విరిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌, మహ్మద్‌ షమీలను వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. తానైతే దీపక్‌ హుడా స్థానంలో అయ్యర్‌కు.. హర్షల్‌ పటేల్‌ స్థానంలో షమీకి చోటు ఇస్తానని పేర్కొన్నాడు.

కొన్ని మార్పులు మినహా అంతా వాళ్లే!
కాగా యువ పేసర్‌ ఆవేశ్‌ ఖాన్‌పై వేటు వేయడం సహా.. గాయంతో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దూరమైన నేపథ్యంలో ఆసియా కప్‌-2022 ఈవెంట్‌ ఆడిన జట్టునే ప్రపంచకప్‌నకు సెలక్ట్‌ చేసింది బీసీసీఐ. గాయం నుంచి కోలుకున్న స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్‌ సహా అక్షర్‌ పటేల్‌ కొత్తగా జట్టులోకి వచ్చారు.

ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదు!
ఇక షమీ, శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయి, దీపక్‌ చహర్‌ స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ట్విటర్‌ వేదికగా స్పందించిన అజారుద్దీన్‌.. శ్రేయస్‌ అయ్యర్‌, షమీని ప్రధాన జట్టుకు ఎంపిక చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరి అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే, చాలా మంది నెటిజన్లు అజారుద్దీన్‌తో ఏకీభవించడం లేదు.

నువ్వొక మాజీ కెప్టెన్‌వి.. కానీ!
గత టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో షమీ ఆట తీరును.. ఆస్ట్రేలియా పిచ్‌లపై శ్రేయస్‌ అయ్యర్‌ విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తూ అజారుద్దీన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘నువ్వొక మాజీ కెప్టెన్‌వి.. కానీ నీకు ఈ విషయాలు తెలియవు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో షమీ ఎకానమీ ఎంతో తెలియదు. అతడు ఎన్ని వికెట్లు పడగొట్టాడో తెలియదు.

ఇక శ్రేయస్‌ అయ్యర్‌ షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడటంలో విఫలమవుతున్నాడనీ తెలియదు. అసలే ఈ ఐసీసీ టోర్నీ జరిగేది ఆస్ట్రేలియాలో! కనీసం ఈ విషయమైనా నీకు గుర్తున్నట్లు లేదు! ఇది టీ20 ఫార్మాట్‌ సర్‌. దీపక్‌ హుడా ఆల్‌రౌండర్‌. అవసరమైనపుడు బౌలింగ్‌ కూడా చేయగలడు. అయినా.. ‘కెప్టెన్‌’ నువ్వు ఏ ప్రాతిపదికన ఈ కామెంట్‌ చేశావు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

షమీ అప్పుడు నిరాశపరిచినా.. ఐపీఎల్‌-2022లో..
కాగా టీ20 ప్రపంచకప్‌-2021లో షమీ కేవలం ఆరు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్‌-2022లో మాత్రం గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడిన షమీ 20 వికెట్లతో రాణించి తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.

కానీ.. పొట్టి ఫార్మాట్‌కు షమీ సూట్‌ కాడన్న అభిప్రాయాల నేపథ్యంలో అతడిని స్టాండ్‌ బైగా ఎంపిక చేయడం గమనార్హం. ఇక దీపక్‌ హుడా బ్యాటర్‌గా రాణించడంతో పాటు స్పిన్‌ బౌలింగ్‌ చేయగలడు కూడా!

చదవండి: నువ్వేమి చేశావు నేరం.. శాంసన్‌ను ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్‌ విచారం
క్రికెట్‌ సౌతాఫ్రికాకు భారీ షాక్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు