T20 WC 2022 Ind Vs Eng: 'మీ బౌలింగ్‌కు ఓ దండం రా బాబు.. వచ్చి ఐపీఎల్‌ ఆడుకోండి'

10 Nov, 2022 16:56 IST|Sakshi

టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘోర పరాజయం పాలైంది. తద్వారా టోర్నీ నుంచి రోహిత్‌ సేన నిష్క్రమించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌.. వికెట్‌ నష్టపోకుం‍డా 16 ఓవర్లలోనే చేధించింది.

ఇంగ్లండ్‌ ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(80), అలెక్స్‌ హేల్స్‌(86) పరుగులు సాధించి ఇంగ్లండ్‌ను ఫైనల్‌కు చేర్చారు. ఇక ఆదివారం (నవంబర్‌ 13)న మెల్‌బోర్న్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో పాకిస్తాన్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది.

చేతులేత్తిసిన భారత బౌలర్లు
ఈ మ్యాచ్‌లో భారత్‌ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం ఒక్క వికెట్‌ కూడా సాధించలేకపోయారు. తొలి ఓవర్‌ నుంచే బౌలర్లకు ఇంగ్లండ్‌ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా భారత సీనియర్‌ పేసర్లు మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌ దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

భువనేశ్వర్‌ రెండు ఓవర్లలో 25 పరుగులు.. షమీ మూడు ఓవర్లో ఏకంగా 39 పరుగులు ఇచ్చారు. మరో వైపు స్పిన్నర్లు కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన అశ్విన్‌ ఏకంగా 27 పరుగులిచ్చాడు. కీలక మైన సెమీ ఫైనల్లో తేలిపోవడంతో భారత బౌలర్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. ఐపీఎల్‌లో అయితే మన బౌలర్లు బాగా రాణిస్తారని కామెంట్లు చేస్తున్నారు.

విఫలమైన రాహుల్‌, రోహిత్‌
ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కోహ్లి(50), హార్దిక్‌ పాండ్యా(63) పరుగులతో రాణించారు.  అయితే ఓపెనర్లు రాహుల్‌, రోహిత్‌ మాత్రం మరో సారి నిరాశ పరిచారు. రాహుల్‌ ఐదు పరుగులే ఔటవ్వగా.. రోహిత్‌ 27 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

A post shared by ICC (@icc)


చదవండి: Ind Vs Eng: టీమిండియా ఓటమి.. ఫైనల్‌కు చేరుకున్న ఇంగ్లండ్‌

>
మరిన్ని వార్తలు