T20 WC 2022: పాక్‌ ఆశలపై నీళ్లు.. గాయంతో స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌

2 Nov, 2022 14:31 IST|Sakshi

PAK VS SA: సెమీస్‌ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్న పాకిస్తాన్‌ జట్టుకు పుండుపై కారం చల్లినట్లు మరో షాక్‌ తగిలింది. రేపు (నవంబర్‌ 3) సౌతాఫ్రికాతో జరుగబోయే కీలక సమరానికి ముందు స్టార్‌ ఆటగాడు ఫఖర్‌ జమాన్‌ గాయపడ్డాడు. వన్‌డౌన్‌లో కీలకంగా వ్యవహరించే జమాన్‌.. మోకాలి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాక్‌ మీడియా మేనేజర్‌ అధికారికంగా ప్రకటించాడు. 

సెమీస్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు కీలక ఆటగాడు అందుబాటులో లేకపోవడం పాక్‌ విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుంది. అసలే మిడిలార్డర్‌ సమస్యతో బాధపడుతున్న పాక్‌కు జమాన్‌ గైర్హాజరీ మరింత ఆందోళన కలిగిస్తుంది. సౌతాఫ్రికాతో ఓడిపోతే పాక్‌ ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.

కాగా, ఆసియా కప్‌ సందర్భంగా గాయపడ్డ జమాన్‌.. ఇటీవలే జట్టులోకి వచ్చాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్‌ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడని జమాన్‌.. చివరిగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో అతను 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం గ్రూప్‌-2 పాయింట్ల పట్టికలో పాక్‌ చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు (నెదర్లాండ్స్‌), రెండు పరాజయాలతో (ఇండియా, జింబాబ్వే) 2 పాయింట్లు (0.765) కలిగి ఉంది. ఈ సమీకరణల నడమ ప్రస్తుతానికి బాబర్‌ సేన్‌ సెమీస్‌ అవకాశాలు మినుమినుకుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కీలక ఆటగాడు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 
 

Poll
Loading...
మరిన్ని వార్తలు