టి20 ప్రపంచకప్‌లో దుమ్మురేపుతున్న వరుణుడు.. 

28 Oct, 2022 16:15 IST|Sakshi

మీరు చదువుతున్న హెడ్‌లైన్‌ కరెక్టే. టి20 ప్రపంచకప్‌ ఏ ముహూర్తానా ప్రారంభించారో తెలియదు కానీ సగం మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రపంచకప్‌లో పరుగుల కంటే ఎక్కువగా వరుణుడు దుమ్మురేపుతున్నాడు. చాన్స్‌ వస్తే చాలు మ్యాచ్‌ రద్దు అయ్యేదాకా విడిచిపెట్టడం లేదు. కనీసం 5 ఓవర్ల ఆటైనా చూస్తామనుకుంటే ఆ భాగ్యం  కూడా లేకుండా చేస్తున్నాడు వరుణుడు. దీంతో వర్షాలు పడే సమయంలో ఆస్ట్రేలియాలో ప్రపంచకప్‌ నిర్వహిస్తున్నారు ఎందుకురా బాబు.. అంటూ క్రికెట్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.

వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దైతే అది ఆయా జట్లపై ప్రభావితం చూపించడం గ్యారంటీ. ఉదాహరణకు అఫ్గానిస్తాన్‌ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒకటి ఓడిపోగా.. మిగతా రెండు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. దీంతో పాయింట్ల ఖాతా తెరిచినప్పటికి గ్రూప్‌-1లో అట్టడుగు స్థానంలో ఉన్న అఫ్గానిస్తాన్‌ కథ దాదాపు ముగిసినట్లే.

ఆఫ్గన్‌ కథ కంచికే..
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓడిన ఆఫ్గన్‌ ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉండగా.. మ్యాచ్‌ రద్దు అయింది. తాజగా శుక్రవారం ఐర్లాండ్‌తో మ్యాచ్‌ కూడా ఇదే రీతిలో వర్షార్పణం అయింది. చాన్స్‌ వస్తే ఐర్లాండ్‌పై గెలవాలని చూసిన ఆఫ్గన్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇక తర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకలతో ఆడాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్క మ్యాచ్‌ ఓడినా ఆఫ్గనిస్తాన్‌ కథ కంచికే.

ఇంగ్లండ్‌ సెమీస్‌ ఆశలు గల్లంతు!
ఇక శుక్రవారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ కూడా ఒక్క బంతి పడకుండానే రద్దు కావడం గమనార్హం. టైటిల్‌ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగిన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ అంటే హోరాహోరీగా సాగడం ఖాయం. అభిమానులు కూడా ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఎదురుచూశారు. టీమిండియా, పాకిస్తాన్‌ల మ్యాచ్‌ తర్వాత క్రికెట్‌లో అత్యంత క్రేజ్‌ ఉన్న మ్యాచ్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌. కానీ ఈసారి కూడా వరుణుడు విలన్‌గా మారాడు.

ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడం ఇంగ్లండ్‌ కొంపముంచేలా ఉంది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లు కూడా ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఒక దాంట్లో గెలిచి.. మరో దాంట్లో ఓడింది. ఈ మ్యాచ్ రద్దయ్యింది. దాంతో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు చెరో మూడు పాయింట్లతో ఉన్నాయి. అయితే ఇంగ్లండ్ సెమీస్ ఆశలు మాత్రం డేంజర్‌లో ఉన్నాయి. ఎందుకంటే ఇంగ్లండ్ తన తర్వాతి రెండు మ్యాచ్ లను బలమైన న్యూజిలాండ్, శ్రీలంక జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ ల్లో ఒక దాంట్లో ఓడినా ఇంగ్లండ్ ప్రపంచకప్ కథ ముగిసినట్లే. ఇక ఆస్ట్రేలియాకు మాత్రం కాస్త బెటర్ ఛాన్స్ లే ఉన్నాయి.  ఆస్ట్రేలియా తన తదుపరి రెండు మ్యాచ్ లను బలహీన అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లతో ఆడాల్సి ఉంది.

లక్కీ టీమ్‌ ఐర్లాండ్‌.. సెమీస్‌ చేరే చాన్స్‌
ఈ టి20 ప్రపంచకప్‌లో లక్కీ టీమ్‌ ఏదైనా ఉందంటే అది ఐర్లాండ్‌ అని చెప్పొచ్చు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణుడు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.అయితే మలాన్ ఆడిన జిడ్డు ఇన్నింగ్స్ కారణంతో పాటు వర్షం కారణంగా ఇంగ్లండ్ ఓడాల్సి వచ్చింది. అయితే ఐర్లాండ్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో బలమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ​్‌లను ఎదుర్కోనుంది. ఆడేద టి20 కాబట్టి ఎప్పుడు ఏం జరిగేది చెప్పలేం. అదృష్టవశాత్తూ ఆసీస్‌, కివీస్‌లలో ఏ జట్టును ఓడించినా ఐర్లాండ్‌ సెమీస్‌కు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

చదవండి: క్రికెట్‌ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు

మరిన్ని వార్తలు