T20 WC 2022: లంకకు ఏమైంది.. ఎందుకిలా?

29 Oct, 2022 18:06 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక పోరాటం సూపర్‌-12లోనే ముగిసేలా కనిపిస్తోంది. శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగుల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది. 168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక 102 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో ఘోర వైఫల్యం లంక కొంప ముంచింది. 168 పరుగుల టార్గెట్‌ అంత కష్టం కాకపోయినా.. కాస్త కష్టపడితే చేధించే అవకాశం ఉంటుంది. కానీ లంక బ్యాటర్లలో అది ఏ కోశానా కనపడలేదు.

లంక టాపార్డర్‌ అయితే మరీ దారుణం. ఏదో వచ్చామా.. ఆడామా వెళ్లామా అన్నట్లుగా నిర్లక్ష్యంగా వికెట్లు పారేసుకున్నారు. మధ్యలో బానుక రాజపక్స 34, కెప్టెన్‌ దాసున్‌ షనక 35 పరుగులతో లంక ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ వీరిద్దరు ఒకేసారి ఔటవ్వడం లంకను దెబ్బ తీసింది. ఇక అక్కడి నుంచి వికెట్ల పతనం మళ్లీ మొదలు. చివరకు 102 పరుగుల వద్ద ఆలౌటై ఘోర పరాజయాన్ని చవిచూసి దారుణ రన్‌రేట్‌తో అట్టడుగు స్థానానికి పడిపోయింది. విచిత్రమేంటంటే.. ఆఫ్గన్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు రద్దు కాగా.. ఒకటి ఓడిపోయింది. అయినా కూడా వారి రన్‌రేట్‌ మెరుగ్గా ఉండడంతో ఐదో స్థానంలో ఉంది. 

దాదాపు నెలరోజుల కిందట ఆసియా కప్‌ 2022 విజేతగా శ్రీలంక నిలిచింది. ఈ విజయాన్ని లంకతో పాటు క్రికెట్‌ను అభిమానించే దేశాలు కూడా సెలబ్రేట్‌ చేసుకున్నాయి. ఎందుకంటే అంతకముందు లంక ఎన్నడు చూడని ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోయింది. ఆసియా కప్‌ టైటిల్‌ గెలవడం లంకకు అమితమైన ఆనందాన్ని ఇచ్చింది. లంక ప్రజలకు ఇది కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు ఈ విజయం ఊరటనిచ్చింది.

అయితే గతేడాది ప్రదర్శన కారణంగా ఈసారి టి20 ప్రపంచకప్‌కు శ్రీలంక నేరుగా అర్హత సాధించలేకపోయింది. దీంతో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. అయితే క్వాలిఫయింగ్‌ పోరులో తొలి మ్యాచ్‌లోనే లంకకు నమీబియా గట్టి షాక్‌ ఇచ్చింది. అయితే ఆ ఓటమిని మరిపిస్తూ వరుసగా విజయాలు నమోదు చేసిన లంక గ్రూఫ్‌ టాపర్‌గా సూపర్‌-12లో అడుగుపెట్టింది. 

దీంతో ఈసారి ప్రపంచకప్‌లో శ్రీలంక అండర్‌డాగ్స్‌ అని.. కచ్చితంగా టైటిల్‌ కొడుతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే అండర్‌డాగ్స్‌ కాస్త తేలిపోయారు. కనీసం సెమీఫైనల్‌కు వెళ్లినా బాగుండు అనుకున్నవాళ్లకి ఆ అవకాశం లేకుండా పోయింది. మరి లంక దారుణ ప్రదర్శన వెనుక కారణాలు ఏమున్నాయని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా లంకను గాయాలు దెబ్బతీశాయి.

టి20 ప్రపంచకప్‌ ఆరంభంలోనే దనుష్క గుణతిలక లాంటి స్టార్‌ ప్లేయర్‌ దూరమవడం జట్టును ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత దుష్మంత చమీరా, దిల్షాన్‌ మధుషనకలు కూడా గాయాలతో దూరమయ్యారు. తాజాగా కివీస్‌తో మ్యాచ్‌కు ముందు జట్టు స్టార్‌ పేసర్‌ బినురా ఫెర్నాండో కూడా తొడ కండరాల గాయంతో తప్పుకోవడం లంకను మరింత కష్టాల్లోకి నెట్టింది.

ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం.. రెండు ఓటములు నమోదు చేసిన లంక పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. గ్రూఫ్‌-1లో ఉ‍న్న అన్ని జట్లకు వర్షం అడ్డంకిగా నిలిచింది.. ఒక్క శ్రీలంకకు తప్ప. లంక తాను ఆడిన మూడు మ్యాచ్‌లు పూర్తిగానే జరిగాయి. ఈ అవకాశాన్ని లంక సరిగా వినియోగించుకోలేక చేతులెత్తేసింది. 

చదవండి: సెంచరీతో పాటు సిక్సర్ల రికార్డు.. అరుదైన క్రికెటర్‌గా ఘనత

కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్‌ ఫిలిప్స్‌

మరిన్ని వార్తలు