Rohit Sharma Press Meet: వరల్డ్‌కప్‌ కంటే అతడి కెరీర్‌ ముఖ్యం! మాకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ఎవరంటే..

15 Oct, 2022 14:49 IST|Sakshi
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

T20 World Cup 2022- Rohit Sharma Comments: టీ20 వరల్డ్‌కప్‌-2022లో తమ మొదటి మ్యాచ్‌ కోసం తుది జట్టు ఎంపికపై ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఎవరెవరు ఆడబోతున్నారో జట్టులో అందరికీ తెలుసునంటూ వ్యాఖ్యానించాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే విధానంపై తనకు నమ్మకం లేదని, ఆరంభ మ్యాచ్‌ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు.

ఆస్ట్రేలియా వేదికగా పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ ఆదివారం మొదలు కానున్న నేపథ్యంలో 16 జట్ల కెప్టెన్లు శనివారం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ ఐసీసీ ఈవెంట్‌లో ఇప్పటి వరకు సాగిన తన ప్రయాణం, ప్రస్తుత టోర్నీకి జట్టు సన్నద్ధమవుతున్న తీరు సహా కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ తదితర అంశాల గురించి వెల్లడించాడు.

ఆ వివరాలు రోహిత్‌ మాటల్లోనే..
బుమ్రా స్థానాన్ని భర్తీ చేసిన పేసర్‌ మహ్మద్‌ షమీ గురించి..
‘‘ఆటలో గాయపడటం సహజం. అలాంటప్పుడు మనమేమీ చేయలేము. అయితే, బెంచ్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే మేము ఇటీవలి కాలంలో యువ ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాము.

ఇక షమీ విషయానికొస్తే.. తనకు కోవిడ్‌ సోకింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాడు. అప్పుడు మేము అతడిని జాతీయ క్రికెట్‌ అకాడమీకి పిలిపించాం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కఠినంగా శ్రమించాడు. ఇప్పుడు తను బ్రిస్బేన్‌లో ఉన్నాడు. మేమంతా రేపు అక్కడికి చేరుకుంటాం. అప్పుడు షమీ మాతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తాడు.

షమీ సానుకూల దృక్పథం కలవాడు. అందుకే అంత త్వరగా కోలుకోగలిగాడు. అతడు ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. గాయాల బెడద ఏ జట్టుకైనా సహజమే. ఇప్పుడు ప్రపంచకప్‌ జట్టులో ఉన్న బౌలర్లంతా కూడా ఇటీవల పలు మ్యాచ్‌లు ఆడిన వాళ్లే! కాబట్టి మేము ప్లేయర్లను రొటేట్‌ చేసుకోగలం’’.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ గురించి
‘‘ఇంతకు ముందు చెప్పినట్లు మా జట్టును గాయాలు వేధిస్తున్న మాట వాస్తవమే. అయితే, ఈ కారణంగా పూర్తిగా నిరాశపడనక్కర్లేదు. ఉన్న అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలి? అందుబాటులో ఉన్న ఆటగాళ్ల సేవలను ఎలా వినియోగించుకోవాలన్న విషయాలపైనే దృష్టి సారించాలి. అక్టోబరు 23 నాటి మ్యాచ్‌ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యాం’’

వరల్డ్‌కప్‌ కంటే బుమ్రా కెరీర్‌ ముఖ్యం
‘‘ఇప్పటి వరకు జస్‌ప్రీత్‌ బుమ్రా జట్టు కోసం చాలానే చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ గాయం కారణంగా తను ఇప్పుడు టీమ్‌తో లేడు. మేము స్పెషలిస్టులతో మాట్లాడాం. కానీ ఫలితం లేదన్నారు.

ప్రపంచకప్‌ టోర్నీ మాకు ముఖ్యమే. కానీ బుమ్రా కెరీర్‌ అంతకంటే ముఖ్యం. తన వయస్సు 27-28 ఏళ్ల మధ్య ఉంటుంది. కాబట్టి మేము రిస్క్‌ చేయాలనుకోలేదు. తను కెరీర్‌లో సాధించాల్సి చాలా ఉంది. మేము కచ్చితంగా ఈ టోర్నీలో తన సేవలను మిస్సవుతాం’’.

సూర్య సూపర్‌
‘‘సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతడి బ్యాటింగ్‌ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా. తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. భయం లేకుండా దూకుడుగా ఆడతాడు. తన నైపుణ్యాలన్నింటినీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలడు. ఈసారి మాకు తనే ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నా’’

2007 నుంచి నా ప్రయాణం
‘‘టీ20 వరల్డ్‌కప్‌ మొదటి ఎడిషన్‌లో నేను ఎలాంటి అంచనాలు లేకుండానే వెళ్లాను. నా తొలి వరల్డ్‌కప్‌లో ఆటను పూర్తిగా ఆస్వాదించాను. మేము గెలిచేంత వరకు అసలేం జరిగిందో నాకు ఏం అర్థం కాలేదు.

2007 నుంచి 2022 వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అప్పట్లో 140- 150 మంచి స్కోరు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చాలా జట్లు 14-15 ఓవర్లకే ఈ స్కోరు సాధించేస్తున్నాయి. ఫలితం గురించి ఆలోచించకుండా దూకుడుగా ఆడుతున్నాయి. టీ20 ఫార్మాట్‌లో మాత్రమే ఇలాంటి రిస్క్‌ చేయగలము. ఈ మార్పులన్నింటినీ నేను గమనించాను’’.

చదవండి: T20 World Cup 2022: భారత్‌, పాక్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. వారం ముందే ఎలా చెప్తారు!
T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌.. ఇతర పూర్తి వివరాలు

మరిన్ని వార్తలు