IND VS ENG: వర్షం కారణంగా సెమీస్‌ రద్దయితే.. ఫైనల్‌కు టీమిండియా

8 Nov, 2022 13:46 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. నవంబర్‌ 9న సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌, ఆ మరుసటి రోజు (నవంబర్‌ 10) అడిలైడ్‌ వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ రెండు మ్యాచ్‌లకు వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదని తెలుస్తోంది. ఒకవేళ సెమీస్‌ మ్యాచ్‌లు జరిగే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడితే పరిస్థితి ఏంటన్న డౌట్‌ అభిమానుల మదిలో మెదలడం ప్రారంభమైంది. 

దీనికి సమాధానం.. ఐసీసీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం‍ రెండు సెమీఫైనల్‌ మ్యాచ్‌లతో పాటు మెల్‌బోర్న్‌ వేదికగా నవంబర్‌ 13న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు కూడా రిజ్వర్‌ డే ఉంది. ఒకవేళ సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం‍ కలిగించి, ఆ రోజు ఆట సాధ్యపడకపోతే.. మ్యాచ్‌ నిలిచిపోయిన దగ్గరి నుంచి (స్కోర్లు) రిజర్వ్‌ డేలో ఆటను కొనసాగిస్తారు. 

ఒకవేళ రిజర్వ్‌ డేలో కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే (సెమీస్‌) మాత్రం గ్రూప్‌లో టేబుల్‌ టాపర్‌గా ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అంటే.. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌, రెండో సెమీస్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరతాయి. అదే ఫైనల్‌ విషయానికొస్తే.. టైటిల్‌ డిసైడర్‌ మ్యాచ్‌ షెడ్యూలైన రోజు వర్షం పడితే రిజర్వ్‌ డేలో, ఆ రోజు కూడా ఆట సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు