T20 WC 2022 IND VS ENG: సెమీస్‌కు ముందు టీమిండియాను వేధిస్తున్న ఆ నలుగురి సమస్య..!

8 Nov, 2022 13:11 IST|Sakshi

నవంబర్‌ 10న ఇంగ్లండ్‌తో జరుగబోయే సెమీస్‌ సమరానికి ముందు నలుగురు ప్లేయర్ల ఫామ్‌ సమస్య టీమిండియాను కలవరపెడుతుంది. ఆ నలుగురిలో జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఉండటం జట్టును మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రోహిత్‌తో పాటు దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌లకు వరుసగా అవకాశలు ఇచ్చినా, సామర్ధ్యం మేరకు రాణించలేక ఘోర వైఫల్యాలు చెందడం మేనేజ్‌మెంట్‌తో పాటు అభిమానులను తీవ్రంగా వేధిస్తుంది. రోహిత్‌ను మినహాయించి సెమీస్‌లో పై ముగ్గురిని తప్పించాలన్నా టీమిండియాకు ప్రత్యామ్నాయం కూడా లేకపోవడం ఆందోళనను రెట్టింపు చేస్తుంది. 

ప్రపంచకప్‌-2022లో రోహిత్‌ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం 89 పరుగులు (4, 53, 15, 2, 15) మాత్రమే చేసి పేలవ ఫామ్‌లో ఉండగా, దినేశ్‌ కార్తీక్‌.. బ్యాటింగ్‌లోనూ వికెట్‌కీపింగ్‌లోనూ దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారాడు. ఫినిషర్‌ కోటాలో జట్టుకు ఎంపికైన డీకే.. ఆ పాత్రకు న్యాయం చేయలేకపోగా, బ్యాటింగ్‌ ఓనమాలు కూడా మరిచి వరుస వైఫల్యాల బాటపట్టాడు. వరల్డ్‌కప్‌లో అతనాడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 14 పరుగులు (1, 6, 7), 4 క్యాచ్‌లు మాత్రమే అందుకుని అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. దీంతో సెమీస్‌లో డీకేకు తిప్పించి పంత్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక, స్పిన్నర్లు అక్షర్‌ పటేల్‌, అశ్విన్‌ల విషయానికొస్తే.. ఈ మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 6 వికెట్లు పడగొట్టగా.. ఆల్‌రౌండర్‌ కోటాలో 4 మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న అక్షర్‌.. అవకాశం వచ్చినా బ్యాటింగ్‌లోనూ,  బౌలింగ్‌లోనూ (3 వికెట్లు) ఘోరంగా విఫలమయ్యాడు. ఈ ఇద్దరు స్పిన్నర్లు వికెట్లు తీయడంలో విఫలమవ్వడంతో పాటు ధారళంగా పరుగులు సమర్పించుకోవడం మరింత కలవరానికి గురి చేస్తుంది.

స్పిన్నర్‌ విషయంలో టీమిండియాకు చహల్‌ రూపంలో మరో చాయిస్‌ ఉన్నా మేనేజ్‌మెంట్‌ దాన్ని ఉపయోగించుకునేందుకు సాహసించలేకపోయింది. వీరిద్దరి వైఫల్యాలపై నజర్‌ వేసిన యాజమాన్యం.. స్పిన్‌కు అనుకూలిం‍చే అడిలైడ్‌ పిచ్‌పై (సెమీస్‌చ వేదిక) ఏ మేరకు మార్పులు చేస్తుందో వేచి చూడాలి. అభిమానులు మాత్రం.. స్పిన్‌ పిచ్‌ అంటున్నారు కాబట్టి అశ్విన్‌ను కొనసాగించి, అక్షర్‌ స్థానంలో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా అవకాశం కల్పించాలని జట్టు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు