T20 World Cup 2022: ఈసారి టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత ఈజీ కాదు: అక్తర్‌

11 Jul, 2022 12:25 IST|Sakshi

T20 World Cup 2022- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్‌-2022లో టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత సులభమేమీ కాదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. ఈసారి భారత జట్టు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు. కాబట్టి బాబర్‌ ఆజం బృందానికి గెలుపు అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు. 

కాగా గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌ టోర్నీలో పాకిస్తాన్‌ అనూహ్య రీతిలో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో కోహ్లి సేనను మట్టికరిపించి ఐసీసీ టోర్నీలో భారత్‌పై తొలి గెలుపు నమోదు చేసింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరుగనుంది. అక్టోబరు 16న మెగా టోర్నీ మొదలు కానుంది. ఇందులో భాగంగా భారత్‌- పాకిస్తాన్‌ జట్లు అక్టోబరు 23న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో తలపడనున్నాయి.

ఈసారి అంత వీజీ కాదు!
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పాకిస్తాన్‌ క్రికెట్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ మేరకు.. ‘‘ఈసారి టీమిండియా సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతుంది. ఈసారి టీ20 వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో భారత్‌ను ఓడించడం పాకిస్తాన్‌కు అంత తేలికేమీ కాదు. ఇప్పుడే విజేతను అంచనా వేయడం కష్టమే.

అయితే, మెల్‌బోర్న్‌ పిచ్‌ పాతబడే కొద్ది బౌన్సీగా తయారవుతుంది. ఫాస్ట్‌ బౌలర్లకు అనూకూలిస్తుంది. కాబట్టి టాస్‌ గెలిస్తే పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ చేయకూడదు’’ అని సూచించాడు. మొదట బ్యాటింగ్‌ చేస్తే మెరుగైన ఫలితం పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా దాదాపు లక్షా యాభై వేల మంది ప్రేక్షకులు మెల్‌బోర్న్‌ గ్రౌండ్‌కు వచ్చే అవకాశం ఉందని అక్తర్‌ అంచనా వేశాడు. 

చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్‌ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్‌ దేవ్‌...
T20 World Cup 2022: జెయింట్‌ రిషబ్‌ పంత్‌.. గాడ్జిల్లాలా ఎంట్రీ.. !

మరిన్ని వార్తలు