T20 WC 2022: టీమిండియా ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్న 1992 సెంటిమెంట్‌..!

7 Nov, 2022 19:30 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌ ఫామ్‌ కనబరుస్తూ సెమీస్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. నవంబర్‌ 10న జరిగే సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. బట్లర్‌ సేనను మట్టికరిపించి ఫైనల్‌కు చేరాలని యావత్‌ భారత అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఫ్యాన్స్‌ ఆకాంక్షలకు తగ్గట్టుగానే కొన్ని సెంటిమెంట్లు కూడా టీమిండియాకు అనుకూలంగానే రిజల్ట్‌ ఉంటుందని సూచిస్తున్నాయి.

కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు కావచ్చు (కెప్టెన్‌గా ప్రతి ఫార్మాట్‌లో తొలి టోర్నీ లేదా సిరీస్‌లో గెలుపు), అలాగే 2011లో టీమిండియా వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు చోటు చేసుకున్న సమీకరణలు (గ్రూప్‌ దశలో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి, ఐర్లాండ్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమి, సెమీస్‌ రేసు నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా నిష్క్రమణ, సెమీస్‌లో భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ అచ్చం ఇలాగే జరిగింది) కావచ్చు.. ఇవన్నీ టీమిండియా ప్రస్తుత ప్రపంచకప్‌ గెలవడాన్నే పరోక్షంగా సూచిస్తున్నాయి.  

అయితే తాజాగా పాక్‌ అభిమానులు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్న ఓ విషయం కొందరు భారత అభిమానులను కలవరపెడుతుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 1992 వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఆస్ట్రేలియా గ్రూప్‌ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాక్‌లు సెమీస్‌కు చేరగా.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై పాక్‌ గెలుపొంది ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో కూడా దాదాపు ఇలాంటి సమీకరణలే చోటు చేసుకోవడంతో టీమిండియా సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడుతుందని, పాక్‌.. ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంటుందని పాక్‌ అభిమానులు శునకానందం పొందుతున్నారు. 

ఈ సెంటిమెంట్ల మాట అటుంచితే.. ఏయే జట్లు ఫైనల్‌కు చేరుతాయో, జగజ్జేతగా ఏ జట్టు ఆవిర్భవిస్తుందో తెలియాలంటే నవంబర్‌ 13న జరిగే ఫైనల్‌ వరకు వేచి చూడాల్సిందే. అంతకుముందు నవంబర్‌ 9న జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌-పాకిస్తాన్‌లు.. ఆమరుసటి రోజు (నవంబర్‌ 10) జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 

Poll
Loading...

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు