Team India: సమయం ఆసన్నమైంది.. ఆ ముగ్గురిపై వేటు వేయాల్సిందే..!

31 Oct, 2022 15:26 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా నిన్న (అక్టోబర్‌ 30) సౌతాఫ్రికా చేతిలో ఎదురైన పరాభవం నుంచి టీమిండియా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు, మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం సఫారీల చేతిలో ఎదురైన పరాభవాన్ని ఆషామాషీగా తీసుకుంటే రోహిత్‌ సేన తదుపరి మ్యాచ్‌ల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. టీమిండియా యాజమాన్యం ఇకనైనా మేల్కొని తుది జట్టులో మార్పులకు శ్రీకారం చుట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. పదే పదే విఫలమవుతున్నా కొందరు ఆటగాళ్లకు మళ్లీమళ్లీ అవకాశాలు ఇచ్చి జట్టు లయను దెబ్బతీయొద్దని కోరుతున్నారు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నుంచి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను ముందుగా పక్కకు పెట్టాలని జట్టు మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. పాక్‌పై 4 పరుగులు, ఆతర్వాత నెదర్లాండ్స్‌పై 9, తాజాగా సౌతాఫ్రికాపై 9 పరుగులకే ఔటై దారుణంగా విఫలమైన రాహుల్‌ స్థానంలో రిషబ్‌ పంత్‌ను ఆడించాలని సూచిస్తున్నారు.

అలాగే ఫినిషర్‌ కోటాలో జట్టులో స్థానం పొందుతున్న దినేశ్‌ కార్తీక్‌పై సైతం వేటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. డీకే అందివచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవడంలో తేలిపోతున్నాడని, ఫినిషర్‌ కాదు కదా కనీసం బ్యాటింగ్‌ ఓనమాలు కూడా తెలియని వాడిలా బ్యాటింగ్‌ చేస్తున్నాడని తూర్పారబెడుతున్నారు. వరల్డ్‌కప్‌ లాంటి కీలక టోర్నీల్లో ఇలా వరుస వైఫల్యాలు చెందుతున్న వారిని వెనకేసుకురావడం జట్టుకు ప్రయోజనకరం కాదని అభిప్రాయపడుతున్నారు. డీకేను తప్పియడం వల్ల తుది జట్టులో అదనపు బ్యాటర్‌ కానీ బౌలర్‌కు కానీ అవకాశం దొరుకుతుందని అంటున్నారు.

ఈ రెండు మార్పులే కాక జట్టులో మరో మార్పు కూడా చేయాలని కొందరు మాజీలు, అభిమానులు పట్టుబడుతున్నారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం దక్కించుకున్న అశ్విన్‌.. బౌలింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతున్నాడని, అతనిపై కూడా వేటు వేసి చహల్‌ లేదా హర్షల్‌ పటేల్‌లలో ఎవరో ఒకరి అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

సూపర్‌-12 దశలో టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం కానుండటంతో జట్టులో ప్రక్షాళణ తప్పనిసరిగా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గ్రూప్‌-2లో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 

Poll
Loading...
మరిన్ని వార్తలు