T20 WC 2022: హార్దిక్‌ పాండ్యా కంటే ముందు వరుసలో... ప్రపంచకప్‌ జట్టులో అతడికి చోటు ఖాయం!

21 Feb, 2022 15:41 IST|Sakshi

‘‘నిజానికి అతడిని ఓపెనర్‌గా చూశాం. కానీ అనూహ్యంగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా సరే అతడు ఆడుతున్న తీరు, ఫినిష్‌ చేస్తున్న విధానం అత్యద్భుతం. అంతేనా.. మెరుగ్గా బౌలింగ్‌ చేస్తూ అవసరమైన సమయంలో ముఖ్యమైన వికెట్లు కూడా పడగొడుతున్నాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌.. భారత యువ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కచ్చితంగా ప్రపంచకప్‌ జట్టులో అతడు స్థానం సంపాదించుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. 

కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా వేదికగా జరిగినన మూడు మ్యాచ్‌లలో కలిసి 92 పరుగులు చేశాడు. చివరి రెండు మ్యాచ్‌లలో లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతడు 24, 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. బౌలర్‌గానూ మెరుగ్గా రాణించాడు. ముఖ్యంగా మూడో మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్‌ వేసిన వెంకటేశ్‌... ముఖ్యమైన 2 వికెట్లు పడగొట్టాడు. విండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌, జేసన్‌ హోల్డర్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... వెంకటేశ్‌ అయ్యర్‌ ప్రదర్శనను కొనియాడాడు. అదే విధంగా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్థానాన్ని అతడు భర్తీ చేస్తాడని, రానున్న ఐసీసీ మెగా ఈవెంట్లలో జట్టులో స్థానం పొందే విషయంలో పాండ్యా కంటే ఓ అడుగు ముందే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు... ‘‘ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే హార్దిక్‌ పాండ్యా కంటే వెంకటేశ్‌ అయ్యర్‌ చాలా మెరుగ్గా ఉన్నాడు. హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తాడో లేదో ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్‌లో రాణించడం ఇప్పుడు అతడి అత్యంత కీలకం. ఏదేమైనా టీ20 ప్రపంచకప్‌ రేసులో మాత్రం వెంకటేశ్‌ హార్దిక్‌ కంటే ముందే ఉంటాడు’’ అని వసీం జాఫర్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: Ind Vs Wi T20 Series- Pollard: అతడు వరల్డ్‌ క్లాస్‌ ప్లేయర్‌.. అందరూ తనను చూసి నేర్చుకోవాలి: పొలార్డ్‌

మరిన్ని వార్తలు