T20 WC 2022: అదే జరిగింది భారత్‌, పాక్‌ సెమీస్‌కు.. సౌతాఫ్రికా ఇంటికి..!

5 Nov, 2022 15:49 IST|Sakshi

అప్‌డేట్‌: ఐసీసీ ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో ఆఖరి రోజైన ఆదివారం (నవంబరు 6) నెదర్లాండ్స్‌ చేతిలో ఓడిన సౌతాఫ్రికా ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో టీమిండియా నేరుగా సెమీస్‌కు అర్హత సాధించగా.. నామమాత్రపు మ్యాచ్‌లో జింబాబ్వేపై ఘన విజయం నమోదు చేసింది. మరోవైపు పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. 

ICC Mens T20 World Cup 2022 : టీ20 వరల్డ్‌కప్‌-2022 కీలక దశకు చేరింది. గ్రూప్‌-1 నుంచి తొలి సెమీస్‌ బెర్త్‌ (న్యూజిలాండ్‌) ఇదివరకే ఖరారు కాగా, శనివారం రెండో స్థానంపై క్లారిటీ వచ్చింది. శ్రీలంకతో కీలక మ్యాచ్‌లో గెలుపొందిన ఇంగ్లండ్‌ సెమీస్‌లో అడుగుపెట్టింది. లంకపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన బట్లర్‌ బృందం.. గ్రూప్‌-1 నుంచి రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. 

ఇక గ్రూప్‌-2 విషయానికొస్తే.. తొలుత ఈ గ్రూప్‌ నుంచి సెమీస్‌ బెర్త్‌లు ఈజీగా ఫైనల్‌ అవుతాయని అంతా ఊహించారు. అయితే చిన్న జట్లైన జింబాబ్వే, బంగ్లాదేశ్‌ల నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురుకావడంతో సెమీస్‌ రేసు రసవత్తరంగా మారింది. ఈ గ్రూప్‌లో ఇప్పటివరకు (నవంబర్‌ 5) అన్ని జట్లు చెరో 4 మ్యాచ్‌లు ఆడగా.. నెదర్లాండ్స్‌ అధికారికంగా, బంగ్లాదేశ్‌, జింబాబ్వే జట్లు అనధికారికంగా సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. పోతే.. సెమీస్‌ రేసులో మిగిలింది మూడు జట్లు. భారత్‌ (6 పాయింట్లు, +0.730), సౌతాఫ్రికా (5 పాయింట్లు, +1.441), పాకిస్తాన్‌ (4 పాయింట్లు, +1.117).

ప్రస్తుత సమీకరణలు, అంచనాల ప్రకారమయితే భారత్‌, సౌతాఫ్రికా సునాయాసంగా సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. భారత్‌, దక్షిణాఫ్రికా తమ ఆఖరి మ్యాచ్‌ల్లో ఎదుర్కొనబోయే జట్లు (జింబాబ్వే, నెదర్లాండ్స్‌) చిన్నవి కాబట్టి, పై సమీకరణలు వర్కౌట్‌ అవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఇదే జరిగి.. సెమీస్‌ రేసులో ఉన్న మరో జట్టు పాక్‌.. తమ ఆఖరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచినా ఎటువంటి ఉపయోగం ఉండదు.

అయితే, పరిస్థితులు తలకిందులై ఏవైనా సంచలనాలు నమోదైందయ్యాయంటే మాత్రం అన్నీ ఒక్కసారిగా తారుమారవుతాయి. సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌ చేతిలో ఓడినా, భారత్‌.. జింబాబ్వే చేతిలో ఓడినా.. ఇవి జరిగి పాక్‌.. బంగ్లాపై భారీ విజయం సాధిస్తే.. గ్రూప్‌-2 నుంచి సెమీస్‌కు చేరే తొలి జట్టుగా పాకిస్తాన్‌, రెండో జట్టుగా భారత్‌ నిలుస్తాయి. ఒకవేళ సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్‌పై గెలిచి, పాకిస్తాన్‌.. బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలిచి, టీమిండియా.. జింబాబ్వే చేతిలో ఓడిందా సౌతాఫ్రికా, పాక్‌లు సెమీస్‌కు వెళ్తాయి. ఇన్ని సమీకరణల నడుమ గ్రూప్‌-2 నుంచి ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందోనన్నది ఆసక్తికరంగా మరింది. 

Poll
Loading...
మరిన్ని వార్తలు