SCO Vs ZIM: క్రెయిగ్‌ ఇర్విన్‌, సికందర్‌ రజా మెరుపులు.. గ్రాండ్‌గా సూపర్‌-12కు జింబాబ్వే

21 Oct, 2022 16:52 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వే సూపర్‌-12లో అడుగుపెట్టింది. గ్రూఫ్‌-బిలో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.

క్రెయిగ్‌ ఇర్విన్‌(58 పరుగులు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. సికందర్‌ రజా 23 బంతుల్లో 40 పరుగులు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికి మిల్టన్‌ షుంబా 11, రియాన్‌ బర్ల్‌ 9 పరుగులు చేసి జట్టును గెలిపించారు. స్కాట్లాండ్‌ బౌలర్లలో జోష్‌ డేవీ 2, బ్రాడ్‌ వీల్‌, మార్క్‌ వాట్‌, మైకెల్‌ లీస్క్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా లేకపోవడం గమనార్హం. స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో మున్సీ 54 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. మెక్‌ లియోడ్‌ 25 పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చతరా, నగర్వాలు తలా రెండు వికెట్లు తీయగా.. ముజరబానీ, సికందర్‌ రాజాలు చెరొక వికెట్‌ తీశారు.

ఈ విజయంతో జింబాబ్వే జట్టు గ్రూఫ్‌-బి టాపర్‌గా సూపర్‌-12లో ఇండియా, పాకిస్తాన్‌లు ఉన్న గ్రూఫ్‌-2లోకి రాగా.. వెస్టిండీస్‌పై విజయం సాధించిన ఐర్లాండ్‌ బి2గా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు ఉన్న గ్రూఫ్‌-1లోకి అడుగుపెట్టింది. ఇక సూపర్‌-12లో గ్రూఫ్‌-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, ఐర్లాండ్‌లు ఉండగా.. గ్రూఫ్‌-2లో ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, జింబాబ్వేలు ఉన్నాయి.

చదవండి: 'హెట్‌మైర్‌ శాపం తగిలింది.. అందుకే విండీస్‌కు ఈ దుస్థితి'

నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి?

మరిన్ని వార్తలు