Ben Stokes: 'సూర్య అద్భుతం.. కోహ్లిని చూస్తే భయం.. రోహిత్‌ను చూస్తే జాలి'

8 Nov, 2022 18:15 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా, ఇంగ్లండ్‌లు నవంబర్‌ 10న(గురువారం) అడిలైడ్‌ వేదికగా రెండో సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. గ్రూప్‌-2 టాపర్‌గా ఉన్న టీమిండియా సెమీస్‌లో బలమైన ఇంగ్లండ్‌ను ఏ విధంగా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరింగా మారింది. ఈ విషయం పక్కనబెడితే ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మాత్రం సెమీస్‌కు ముందు కోహ్లి, రోహిత్‌,సూర్యకుమార్‌ల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

''సరైన సమయంలో కోహ్లి ఫామ్‌లోకి రావడం మాకు ఇబ్బంది కలిగించే విషయం. ఒక్కోసారి కోహ్లి ఆటను చూస్తుంటే భయమేస్తోంది. ఇప్పటికే తనేంటో.. మూడు ఫార్మాట్లలో తాను ఎంత గొప్ప ఆటగాడనేది నిరూపించుకున్నాడు. వరల్డ్‌కప్‌లో స్థిరత్వంతో పరుగులు సాధిస్తున్న కోహ్లిని తొందరగా ఔట్‌ చేయడమే మా లక్ష్యం. ఇక మా జట్టు సెమీస్‌లో రాణిస్తుందనే నమ్ముతున్నా. గత ఫలితాలను పట్టించుకోకుండా సెమీఫైనల్‌ ఆడేందుకు ప్రయత్నిస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో రోహిత్‌ శర్మ ఫామ్‌పై స్పందిస్తూ..''హిట్‌మ్యాన్‌ ఫామ్‌లో ఉంటే ఎంత డేంజరనేది మాకు తెలుసు. కానీ ప్రస్తుతం అతను ఫామ్‌లేమితో ఇబ్బంది పడడం చూస్తుంటే జాలేస్తోంది. కానీ అతను ఫామ్‌లోకి రావడానికి ఒక్క ఇన్నింగ్స్‌ చాలు. కానీ అది మాపై ఆడకూడదని గట్టిగా కోరుకుంటున్నా. రోహిత్‌ను లైట్‌ తీసుకునే చాన్స్‌ అస్సలు లేదు'' అంటూ తెలిపాడు.

సూర్యకుమార్‌ ఆటపై స్పందించిన స్టోక్స్‌.. ''ప్రపంచానికి తన ఆటను గట్టిగా చూపిస్తున్నాడు. అతను ఒక అద్భుతమైన ప్లేయర్‌. ఒక్కోసారి అతను కొట్టే షాట్లు నిస్సహాయ స్థితిలో తలలు గోక్కునేలా చేస్తాయి. అతనున్న ఫామ్‌కు తట్టుకోవడం కష్టం. కానీ వీలైనంత తొందరగా అతన్ని పెవిలియన్‌ చేర్చడానికి ప్రయత్నిస్తాం. ఈ గురువారం మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్‌'' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: 'వెళ్లిపోయాకా ఈ మాట చెప్పడం ఎందుకు?'.. హెడెన్‌కు చురకలు

టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు మరో బిగ్‌ షాక్‌..!

>
మరిన్ని వార్తలు