T20 World Cup 2022: ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు..

27 Sep, 2022 16:53 IST|Sakshi

T20 World Cup 2022- Indian Squad: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సైతం సెప్టెంబరు 12న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. నలుగురిని స్టాండ్‌ బైగా ఎంపిక చేసింది. ఇక వరల్డ్‌కప్‌ కంటే ముందు రోహిత్‌ సేన స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది.

అయితే, 2-1తో ట్రోఫీ కైవసం చేసుకున్నప్పటికీ బౌలింగ్‌ వైఫల్యం, ఫీల్డింగ్‌ తప్పిదాలు కలవరపెట్టే అంశాలుగా పరిణమించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్‌ ప్రధాన జట్టుకు ఎంపికైన కొంతమంది క్రికెటర్ల ఆట తీరు ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ ఎందుకు సెలక్ట్‌ చేసిందా? అని చాలా మంది పెదవి విరుస్తున్నారు.

యజువేంద్ర చహల్‌
టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్‌లలో తుది జట్టులో చోటు దక్కించుకున్న అతడు 9.12 ఎకానమీతో బౌలింగ్‌ చేసి.. రెండే రెండు వికెట్లు తీశాడు.

ఇక ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీలోనూ సూపర్‌-4లో శ్రీలంకతో మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడం మినహా తన స్థాయికి తగ్గట్లు రాణించలేక నిరాశపరిచాడు యుజీ. ముఖ్యంగా స్లోగా బంతులు వేయడంలో విఫలమవుతున్నాడు.

సమకాలీన లెగ్‌ స్పిన్నర్లు ఆస్ట్రేలియాకు చెందిన ఆడం జంపా, అఫ్గనిస్తాన్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ మాదిరి రాణించలేకపోతున్నాడు. దీంతో.. అతడి స్థానంలో యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయిని ప్రధాన జట్టుకు ఎంపిక చేసినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అనుభవం దృష్ట్యా యుజీకి ఓటు వేయడమే సబబు అంటున్నారు అతడి ఫ్యాన్స్‌.

భువనేశ్వర్‌ కుమార్‌
టీమిండియా డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచిన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తేలిపోయాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన ఈ స్పీడ్‌స్టర్‌ 91 పరుగులు సమర్పించుకున్నాడు. 

గతేడాది వరకు టీమిండియా టీ20 అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా కొనసాగిన ఈ స్వింగ్‌ సుల్తాన్‌.. గాయం కారణంగా కొన్నిరోజులు జట్టుకు దూరమయ్యాడు. అయితే, తిరిగి జట్టులోకి వచ్చినా అవకాశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.

ముఖ్యంగా డెత్‌ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేక విఫలమవుతున్నాడు. ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీ, ఆసీస్‌తో సిరీస్‌లో డెత్‌ ఓవర్లలో అతడి వైఫల్యం కనబడింది. నకుల్‌ బాల్స్‌, కట్టర్లు వేయడంలో దిట్ట అయిన భువీ ప్రస్తుతం ఫామ్‌లేమితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వెటరన్‌ పేసర్‌కు బదులు స్టాండ్‌ బైగా ఉన్నా దీపక్‌ చహర్‌ను ఎంపిక చేసినా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దీపక్‌ హుడా
వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న దీపక్‌ హుడా.. ఆసీస్‌తో సిరీస్‌కు సైతం ఎంపికయ్యాడు. అయితే, ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అతడు దూరమయ్యాడు.

దీంతో.. ప్రపంచకప్‌ స్టాండ్‌ బై ప్లేయర్లలో ఒకడిగా ఉన్న స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో దీపక్‌ స్థానాన్ని భర్తీ చేశారు. నిజానికి దీపక్‌ టాపార్డర్‌లో మెరుగ్గా రాణించగలడు. అవసరమైనపుడు స్పిన్‌ బౌలింగ్‌ కూడా చేయగలడు. 

ఒకవేళ గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్‌ ఆరంభ సమయానికి అతడు అందుబాటులో ఉన్నా.. అతడు బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌తో పాటు విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా.. ఈ ఐదుగురు కచ్చితంగా తుది జట్టులో ఉంటారు.

కాబట్టి టాపార్డర్‌లో దీపక్‌ హుడాతో పనిలేదు. ఇక బౌలింగ్‌ కారణంగా ఆల్‌రౌండర్ల జాబితాలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనుకున్నా.. అక్షర్‌ పటేల్‌ ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా అదీ అసాధ్యంగానే కనిపిస్తుంది. అందుకే హుడాను ప్రపంచకప్‌నకు సెలక్ట్‌ చేసి కూడా పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ బ్యాకప్‌ బ్యాటర్‌ కావాలనుకుంటే లెఫ్ట్‌ హ్యాండర్‌ ఇషాన్‌ కిషన్‌ లేదంటే విలక్షణమైన బ్యాటర్‌గా పేరొందిన సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినా బాగుండేదంటున్నారు విశ్లేషకులు. జట్టులో మార్పునకు సమయం ఉన్న తరుణంలో ఇప్పటికైనా మార్పులుచేర్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

చదవండి: Sandeep Lamichhane: స్టార్‌ క్రికెటర్‌ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

మరిన్ని వార్తలు