David Warner: ఫామ్‌లో లేడు.. ముసలోడు.. నెమ్మదిగా ఆడతాడు.. కంగ్రాట్స్‌..

15 Nov, 2021 15:11 IST|Sakshi

విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చిన కాండిస్‌ వార్నర్‌

T20 WC David Warner: Candice Warner Dig At Critics Out of Form Old Slow Congrats: యూఏఈలో మ్యాచ్‌ల నుంచి తప్పించడమే కాదు, మైదానానికి కూడా రాకుండా ఆ ఆటగాడిని హోటల్‌ గదికే పరిమితం చేసింది ఐపీఎల్‌ టీమ్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ. ఎస్‌ఆర్‌హెచ్‌కు తొలి టైటిల్‌ అందించిన కెప్టెన్‌గా.. స్టార్‌ బ్యాటర్‌గా.. పిచ్‌పై ఆడాల్సిన వాడు ‘ఎక్స్‌ట్రా’ తరహాలో చప్పట్లు కొడుతూ డ్రింక్స్‌ అందించడం సగటు క్రికెట్‌ అభిమానిని ఆవేదనకు గురి చేసింది. ఆ కసిలోంచి పుట్టిన ఆటనే కావచ్చు, తానేంటో చూపించాలనే పట్టుదల కావచ్చు... నెల రోజులు తిరిగేసరికి టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో తానేంటో నిరూపించుకున్నాడు. కీలకమైన సమయంలో జాతీయ జట్టు చిరస్మరణీయ విజయంలో తన వంతు పాత్ర పోషించి... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచాడు. ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గురించే ఈ ప్రస్తావన.

ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచకప్‌ బరిలోకి దిగిన ఆసీస్‌ ఈసారి కొత్త చాంపియన్‌గా అవతరించింది. ఈ విజయంలో వార్నర్‌ ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో ఏడు మ్యాచ్‌లలో 289 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 89 నాటౌట్‌. ఇది వర్తమానం. కానీ.. ఐపీఎల్‌లో వార్నర్‌ ప్రదర్శన, ఫ్రాంఛైజీ అతడిని పక్కన పెట్టిన విధానం చూసి అనేక మంది అతడిని విమర్శించారు. అసలు అతడికి ప్రపంచకప్‌ తుదిజట్టులో చోటు దక్కుతుందా లేదోనంటూ కామెంట్లు చేశారు.

కానీ... టోర్నీ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌.. కచ్చితంగా వార్నర్‌ ఓపెనర్‌గా మైదానంలోకి వస్తాడని చెప్పాడు. సారథి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు వార్నర్‌. ఈ నేపథ్యంలో వార్నర్‌ సతీమణి కాండిస్‌ వార్నర్‌ తన భర్తను విమర్శించిన వారికి అదిరిపోయే రీతిలో కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ఫామ్‌లో లేడు... ముసలివాడు... నెమ్మదిగా ఆడతాడు! కంగ్రాట్స్‌ డేవిడ్‌ వార్నర్‌’’ అంటూ విమర్శకులకు తన భర్త సాధించిన విజయంతో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా డేవిడ్‌ వార్నర్‌ ఫొటోను షేర్‌ చేశారు.

చదవండి: T20 WC 2021- Aaron Finch: తన పని అయిపోయిందన్నారు.. కానీ వార్నర్‌ మాత్రం.. చాలా గర్వంగా ఉంది..

మరిన్ని వార్తలు