David Warner: ఓహో అక్కడే పెట్టాలా.. రొనాల్డోకు మంచిదైతే నాకూ మంచిదే కదా..

29 Oct, 2021 08:47 IST|Sakshi
డేవిడ్‌ వార్నర్‌(PC: Twitter)- క్రిస్టియానో రొనాల్డో

David Warner tries to do a Cristiano Ronaldo at presser Goes Viral: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌. అక్టోబరు 28 నాటి మ్యాచ్‌లో 42 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఐపీఎల్‌-2021 సీజన్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలు, విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే, వార్నర్‌ మాత్రం ఫామ్‌ గురించి తాను ఎప్పుడూ ఆలోచించని, బౌలర్లపై ఒత్తిడి పెంచి పరుగులు రాబట్టడంపైనే దృష్టి పెడతానని వ్యాఖ్యానించాడు. 

అది అస్సలు సాధ్యం కాదు
ఈ మేరకు అర్ధ సెంచరీ సాధించిన వార్నర్‌ మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘విమర్శకుల నోళ్లు మూయించగలమా? అదైతే అస్సలు సాధ్యం కాదు. ఆటలో ఇవన్నీ సహజం. బాగా ఆడినపుడు ప్రశంసలు... అలా జరగని పక్షంలో విమర్శలు ఉంటాయి. అయితే, వీటన్నింటినీ పట్టించుకోకుండా... ముఖంపై చిరునవ్వు చెదరనీయకకుండా పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాలి’ అని చెప్పుకొచ్చాడు.

క్రిస్టియానోకు మంచిదైతే.. నాకూ మంచిదే కదా
ఇక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో భాగంగా వార్నర్‌​ ప్రవర్తించిన తీరు ఆసక్తికరంగా మారింది. యూరో ఛాంపియన్‌షిప్‌ ప్రెస్‌ మీట్‌ సందర్భంగా పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్‌ రొనాల్డో.. తనకు ఎదురుగా ఉన్న కోక్‌ బాటిళ్లను పక్కకుపెట్టి, మంచి నీళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన సంగతి తెలిసిందే. వార్నర్‌ సైతం గురువారం ఇదే తరహాలో వ్యవహరించాడు. ‘‘వీటిని పక్కకు పెట్టవచ్చా’’ అంటూ తన ముందున్న కోకా కోలా బాటిళ్లను తీసి కిందపెట్టాడు. 

అంతలోనే ఓ వ్యక్తి వచ్చి.. బాటిళ్లను టేబుల్‌ మీద పెట్టాల్సిందిగా సూచించాడు. ఇందుకు నవ్వుతూ సమాధానమిచ్చిన వార్నర్‌... ‘‘ఓహో అక్కడే పెట్టాలా.. సరే’’ అన్నాడు. ఆ తర్వాత... ‘‘ఒకవేళ క్రిస్టియానోకు ఇది మంచిదైతే.. నాకు కూడా మంచిదే’’అంటూ చమత్కరించాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే ఆసీస్‌.. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా రోనాల్డో కోక్‌ వీడియో తర్వాత కోకా కోలా కంపెనీకి భారీ స్థాయిలో నష్టం జరిగిన సంగతి తెలిసిందే. వేల కోట్ల మేర నష్టం వాటిల్లింది.

చదవండి: టీమిండియా క్రికెటర్‌కు డబుల్‌ ధమాకా.. కవల పిల్లలు జననం

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు