Women T20 WC: కీపర్‌ తెలివితక్కువ పనికి మూల్యం చెల్లించుకున్న పాక్‌ 

22 Feb, 2023 13:52 IST|Sakshi

ICC Womens T20 World Cup 2023- ENGW Vs PAKW: మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ సిద్రా నవాజ్‌ చేసిన తప్పునకు పెనాల్టీ కింద ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు అంపైర్లు.

విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో బ్యాటర్‌ బ్యాక్‌ఫుట్‌ షాట్‌ ఆడింది. బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ఫీల్డర్‌ కీపర్‌ సిద్రా నవాజ్‌కు త్రో విసిరింది. అయితే కీపర్‌ నవాజ్‌ తన చేతికున్న గ్లోవ్స్‌ను కింద పడేసి బంతిని అందుకుంది. ఆ తర్వాత బంతిని కింద పడేసిన గ్లోవ్స్‌కు కొట్టింది. ఇది గమనించిన అంపైర్లు కొంతసేపు చర్చించుకున్న తర్వాత కీపర్‌ నవాజ్‌ తప్పిదాన్ని గుర్తిస్తూ పాక్‌కు పెనాల్టీ విధిస్తూ ఇంగ్లండ్‌కు ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

క్రికెట్‌ నిబంధనల ప్రకారం కీపర్‌ ఓవర్‌ పూర్తయిన తర్వాతే చేతికున్న గ్లోవ్స్‌ తొలగించొచ్చు.. లేదంటే బౌలర్‌ బంతి విడవకముందు సరిచేసుకోవచ్చు. కానీ ఒక్కసారి బంతి వేశాకా గ్లోవ్స్‌ తీసేసినా.. కింద పడేసిన గ్లోవ్స్‌పై బంతిని విసరడం నిబంధనలకు విరుద్ధం. ఈ తప్పిదం కింద జట్టుకు పెనాల్టీ విధించడం జరుగుతుంది. 

ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ నాట్ స్కివర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టు భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 40 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌ సాయంతో 81 పరుగులు చేసింది. ఆమెతో పాటు అమీ జోన్స్‌(47) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడింది. వీరిద్దరి ఇన్నింగ్స్‌ల ఫలితంగా ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. ఇక పాకిస్తాన్‌ బౌలర్లలో ఫాతిమా సానా రెండు, ఇక్భాల్‌, నిదా ధార్‌, హసన్‌ తలా వికెట్‌ సాధించారు.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 99 పరుగులకే కుప్పకూలింది. తద్వారా 114 పరుగుల తేడాతో పాక్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఫిబ్రవరి 24న జరగనున్న రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌.. సౌతాఫ్రికాతో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 23న(గురువారం) జరగనున్న తొలి సెమీఫైనల్లో టీమిండియా వుమెన్స్‌, ఆస్ట్రేలియా అమితుమీ తేల్చుకోనున్నాయి.

A post shared by ICC (@icc)

చదవండి: పాక్‌ కెప్టెన్‌పై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు

కోహ్లి ప్రపంచ రికార్డు.. లిస్టులో ఎవరున్నారో తెలియదు కానీ: గంభీర్‌

మరిన్ని వార్తలు