T20 WC Ind Vs Nz: భారత ఆటగాళ్లను ఫారిన్‌ లీగ్‌లలో ఆడనివ్వాలి.. అప్పుడే: మైకేల్‌ వాన్‌

1 Nov, 2021 13:17 IST|Sakshi

Michael Vaughan Comments On Team India Players: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో టీమిండియా పేలవ ప్రదర్శనపై విమర్శలు కొనసాగుతున్నాయి. కోహ్లి సేన తమ స్థాయికి తగ్గట్లుగా ఆడినట్లు ఎక్కడా కనిపించలేదని, ఒత్తిడిలో పూర్తిగా చిత్తై పోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ మైకేల్‌ వాన్‌.. భారత జట్టును ఉద్దేశించి తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు.

ఇంత ప్రతిభ ఉండి, పెద్ద జట్టుగా పేరొందిన టీమిండియా గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతుందన్నాడు. వినడానికి కష్టంగా ఉన్నా.. ఇదే నిజమని చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచంలోని ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతినివ్వాలని బీసీసీఐకి మైకేల్‌ వాన్‌ సూచించాడు. 

తద్వారా వివిధ పిచ్‌లపై సమర్థవంతంగా ఎలా ఆడాలన్న విషయంపై అవగాహన, అనుభవం వస్తుందని పేర్కొన్నాడు. అయితే, టీమిండియా అభిమానులు మాత్రం.. ‘ఒక్కసారి ఓడినందుకు ఇంతలా విమర్శించాల్సిన పనిలేదు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గెలుపోటములు సహజం’’ అని మైకేల్‌కు బదులిస్తున్నారు.

కాగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా.. అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సెమీస్‌ చేరే అవకాశాలు సన్నగిల్లాయి. 

చదవండి: Virat Kohli:: ఓటమికి చింతిస్తున్నాం.. ఇక ఇంటికే.. ‘కోహ్లి ట్వీట్‌’ వైరల్‌

మరిన్ని వార్తలు