T20 World Cup 2022: సెమీస్‌ చేరే అవకాశాలు 30 శాతమే.. కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

20 Oct, 2022 08:03 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరోసారి ఫేవరెట్‌గానే బరిలోకి దిగింది. గతేడాది ఘోర వైఫల్యంతో సూపర్‌-12 దశలోనే వెనుదిరిగిన టీమిండియా ఈసారి మాత్రం అలాంటి ప్రదర్శన చేయకూడదని అభిమానులు భావిస్తున్నారు. 2007 తొలి ఎడిషన్‌ మినహా మరోసారి కప్‌ కొట్టలేకపోయిన టీమిండియా ఈసారైనా విజేతగా నిలుస్తుందేమో చూడాలి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియాపై దిగ్గజం కపిల్‌ దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా  సెమీస్‌ చేరే అవకాశాలు 30 శాతం మాత్రమే ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

''టి20 క్రికెట్‌లో ఒక మ్యాచ్ గెలిచే టీమ్‌ తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవచ్చు. ఇండియా వరల్డ్‌కప్‌ గెలిచే అవకాశాల గురించి మాట్లాడడం చాలా కష్టం. అసలు టీమిండియా సెమీస్‌కు చేరుతుందా అంటే అనుమానమే. నేను దీని గురించే ఆలోచిస్తున్నాను. ఆ తర్వాతే ఏదైనా చెప్పగలం. నా వరకు ఇండియా టాప్‌ ఫోర్‌లోకి చేరడానికి కేవలం 30 శాతం అవకాశమే ఉంది." అని పేర్కొన్నాడు. అయితే దీని వెనుక కారణమేంటన్నది మాత్రం కపిల్‌ వివరించలేదు. 

ఆల్‌రౌండర్ల విషయం ప్రస్తావిస్తూ.. "వరల్డ్‌కప్‌ అనే కాదు ఏ మ్యాచ్‌లు లేదా ఈవెంట్లు గెలిపించే ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? హార్దిక్‌ పాండ్యాలాంటి ప్లేయర్‌ ఇండియాకు ఎంతో ఉపయోగపడతాడు. ఏ టీమ్‌కైనా ఆల్‌రౌండర్లు కీలకం. వాళ్లే టీమ్‌కు బలం. తుది జట్టులో ఆరో బౌలర్‌ను తీసుకునే స్వేచ్ఛను హార్దిక్‌లాంటి ప్లేయర్స్ రోహిత్‌కు ఇస్తారు. అతడు మంచి బ్యాటర్‌, బౌలర్, ఫీల్డర్‌ కూడా. రవీంద్ర జడేజా కూడా ఇండియాకు మంచి ఆల్‌రౌండరే" అని వెల్లడించాడు.

ఇండియన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై స్పందిస్తూ.. "నిజానికి సూర్యకుమార్‌ ఇంతగా ప్రభావం చూపుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ అతడు బ్యాటింగ్‌లో ఎంతో గొప్పగా రాణించి ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇప్పుడు అతడు లేని ఇండియన్‌ టీమ్‌ను ఊహించలేం. విరాట్‌, రోహిత్‌,రాహుల్‌లాంటి వాళ్లతో కలిసి సూర్య ఉండటం ఏ టీమ్‌నైనా బలంగా మారుస్తుంది" అని  పేర్కొన్నాడు.

చదవండి: గంగూలీ అయిపోయాడు.. ఇప్పుడు చేతన్‌ శర్మ వంతు?!

మరిన్ని వార్తలు