Virat Kohli- Rohit Sharma: ‘ఆఖరి మ్యాచ్‌లో కోహ్లి... రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి’

8 Nov, 2021 14:06 IST|Sakshi

T20 WC Kohli To Offer Leadership Rohit Sharma Final Game Sanjay Manjrekar: టీ20 వరల్డ్‌కప్‌ గెలిచి ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలన్న టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిని దురదృష్టం వెక్కిరించింది. అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్‌ విజయం సాధించడంతో టీమిండియా సెమీస్‌ ఆశలు గల్లంతైన నేపథ్యంలో రిక్తహస్తాలతోనే వెనుదిరగాల్సిన పరిస్థితి. టోర్నీ ఆరంభంలో చేసిన భారత జట్టు చేసిన తప్పిదాల కారణంగా ఈవిధంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. నాకౌట్‌ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో నవంబరు 8న టీమిండియా.. పసికూన నమీబియాతో నామమాత్రపు మ్యాచ్‌ ఆడనుంది.

కాగా, టీ20 వరల్డ్‌కప్‌-2021 ముగియగానే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటానని కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈవెంట్‌ చివరి మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పజెప్పాలని సూచించాడు. టీమిండియా- నమీబియా మ్యాచ్‌ నేపథ్యంలో మంజ్రేకర్‌ మాట్లాడుతూ.. ‘‘టీ20 క్రికెట్‌లో భారత్‌కు మెరుగైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్న కోహ్లి గనుక సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తే.. ఫైనల్‌ మ్యాచ్‌లోనే తనంతట తానుగా రోహిత్‌ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలి.

అలా అయితే తనను విశ్రాంతి పేరిట పక్కకు పెట్టరు. కెప్టెన్‌గా తను ముందుకు సాగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు డఫా న్యూస్‌తో తన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా ముచ్చటించాడు. కాగా టీ20 తదుపరి కెప్టెన్‌గా హిట్‌మాన్‌ నియామకం లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. వయసు రీత్యా 34 ఏళ్ల రోహిత్‌ కంటే కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని కొంత మంది మాజీలు అంటున్నారు.

ఈ నేపథ్యంలో మంజ్రేకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక 2017లో టీమిండియా టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడిన కోహ్లి.. ఇప్పటి వరకు 49 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అందులో 29 మ్యాచ్‌ల(గెలుపు శాతం 63.82)లో విజయాలు అందించాడు. 

చదవండి: T20 WC: అఫ్గన్‌ తమ స్థాయికి తగ్గట్లు ఆడలేదు: టీమిండియా మాజీ క్రికెటర్లు

>
Poll
Loading...
మరిన్ని వార్తలు