Ravi Shastri: రవిశాస్త్రి భావోద్వేగం.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా అతడి రికార్డులు ఇవే!

9 Nov, 2021 08:51 IST|Sakshi
PC: ICC

Ravi Shastri Gets Emotional Comments On Rahul Dravid Rohit Sharma: ‘‘డ్రెస్సింగ్‌ రూమ్‌కు దూరమవుతున్నందుకు భావోద్వేగానికి లోనవుతున్నాను. కానీ చాలా గర్వంగా నిష్క్రమిస్తున్నా. నేను కోచ్‌గా మారేందుకు శ్రీనివాసనే కారణం. నాపై నాకంటే ఆయన ఎక్కువ నమ్మకముంచారు. జీవితంలో సాధించిన ఘనతల గురించే మాట్లాడవద్దు. అడ్డంకులను ఎలా అధిగమించామనేది కూడా ముఖ్యం. గత ఐదేళ్లుగా మా కుర్రాళ్లు ప్రపంచంలో అన్ని మూలలా అద్భుతంగా ఆడారు.

క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ జట్లలో ఇదొకటి. ఐసీసీ ట్రోఫీ ఒకటి లోటుగా ఉండిపోయింది కానీ కొత్త హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ నేతృత్వంలో అది దక్కాలని కోరుకుంటున్నా. టి20ల్లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అన్ని విధాలా సమర్థుడు’’ అని టీమిండియా హెడ్‌కోచ్‌గా సేవలు అందించిన రవిశాస్త్రి ఉద్వేగానికి గురయ్యాడు. భారత జట్టుతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీ ముగిసిన తర్వాత తన పదవి నుంచి తప్పుకొంటానని రవిశాస్త్రి పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్‌ తర్వాత టీ20 కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లి గుడ్‌బై చెప్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. దీంతో  అతడికి డిప్యూటీగా వ్యవహరించిన రోహిత్‌ శర్మ పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. కొత్త కోచ్‌, టీ20 కొత్త కెప్టెన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో నమీబియాతో నామమాత్రపు మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా గెలుపుతో ఈవెంట్‌ను ముగించింది.

టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి రికార్డు(Ravi Shastri Record As Team India Head Coach)

ఫార్మాట్‌     ఆడినవి    గెలిచినవి     ఓడినవి     ‘డ్రా’
టెస్టులు      43          25            13      5
వన్డేలు    76      51            22     –
టి20లు     65            43            18     – 
మొత్తం      184      119            53     5

మరిన్ని వార్తలు