T20 World Cup: సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించు.. ఇదే మంచి ఛాన్స్‌!

23 Sep, 2021 16:23 IST|Sakshi

Saba Karim Comments On Shreyas Iyer: కొత్త క్రికెటర్లు వచ్చి, కాస్త మెరుగ్గా ఆడినంత మాత్రాన కీలక ఆటగాళ్లను పక్కన పెట్టడం సరికాదని టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ సబా కరీం అన్నాడు. ఆరు నెలల క్రితం మంచి ఫాంలో ఉన్న క్రికెటర్‌.. గాయాల బారిన పడి కోలుకున్న తర్వాత కూడా సదరు ఆటగాడికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదని సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు. టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ పట్ల సెలక్షన్‌ కమిటీ వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ సబా కరీం ఈ విధంగా స్పందించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ను స్టాండ్‌ బై ప్లేయర్‌గా ఎంపిక చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు.

కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోలుకున్న అతడు ఐపీఎల్‌-2021 సీజన్‌ రెండో దశకు అందుబాటులోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున బరిలోకి దిగి బుధవారం నాటి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌లో  47 పరుగులతో (41 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించి అజేయంగా నిలిచాడు.  ఇక ఐపీఎల్‌ సంగతి ఇలా ఉంటే... వచ్చే నెలలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసిన జట్టులోని ప్రధాన ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్‌కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. స్టాండ్‌ బై ప్లేయర్‌గా అతడిని ఎంపిక చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో... సెలక్టర్‌గా సేవలు అందించిన సబా కరీం ఓ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ సెలక్టర్లు ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో ఆచితూచి వ్యవహరించాలి. నిజానికి తాను టీ20 ప్రపంచకప్‌లో భాగం కాలేకపోతున్నానన్న విషయం జీర్ణించుకోవడం శ్రేయస్‌ అయ్యర్‌కు కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇంగ్లండ్‌తో సిరీస్‌ సమయంలో తను టాపార్డర్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. మంచి ప్రదర్శన కనబరిచాడు. అయితే, దురదృష్టవశాత్తూ తొలి వన్డే తర్వాత గాయపడ్డాడు. అందులో తన తప్పేం ఉంది. కోలుకున్న తర్వాత కూడా అతడికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం సరికాదు. 

గతంలో మెరుగ్గా రాణించిన ఆటగాళ్లను మర్చిపోవడం దారుణం. ఆర్నెళ్ల క్రితం కీలక ఆటగాడిగా ఉన్న వ్యక్తిని పక్కన పెట్టడం ఏమిటి? కొత్త ఆటగాళ్లు వచ్చి.. కాసిన్ని పరుగులు చేస్తే సరిపోతుందా? వాళ్ల కోసం టాప్‌ ప్లేయర్‌ను పక్కనపెట్టడం సరికాదు. ఐపీఎల్‌ రూపంలో శ్రేయస్‌ అయ్యర్‌కు మంచి అవకాశం దొరికింది. సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించే ఛాన్స్‌ అతడికి ఉంది. త్వరలోనే శ్రేయస్‌ కచ్చితంగా భారత టీ20 జట్టులోకి వస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. నిజానికి తన రాకతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు పరిపూర్ణమైందని సబా కరీం శ్రేయస్‌పై ప్రశంసలు కురిపించాడు.

టీమిండియా టీ20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు.
స్టాండ్‌ బై ప్లేయర్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌.

చదవండి: Shreyas Iyer: ఆ నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయా.. ఇప్పుడు కూడా

మరిన్ని వార్తలు