Virat Kohli: ‘ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడు.. ఎందుకంటే!’

15 Sep, 2022 10:40 IST|Sakshi
విరాట్‌ కోహ్లి

T20 World Cup 2022- Virat Kohli: ఆసియా కప్‌-2022 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. అంతర్జాతీయ కెరీర్‌లో ఈ రన్‌మెషీన్‌కు ఇది 71వ శతకం కాగా.. పొట్టి ఫార్మాట్‌లో మొదటి సెంచరీ. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌(274 పరుగులు) కూడా కోహ్లినే కావడం విశేషం.

ఈ నేపథ్యంలో.. ఇదే తరహాలో టీ20 వరల్డ్‌కప్‌-2022 ఈవెంట్‌లోనూ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాలని కింగ్‌ కోహ్లి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు మాత్రం కోహ్లి రిటైర్మెంట్‌ గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం ఫ్యాన్స్‌కు చిరాకు తెప్పిస్తున్నాయి.

పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌ బై చెబుతాడు!
పాక్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది.. కోహ్లిని ఉద్దేశించి.. కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉన్నపుడే ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం ఇదే తరహాలో మాట్లాడాడు.

టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌ బై చెబుతాడని అంచనా వేశాడు. ఈ మేరకు ఈ మాజీ ఫాస్ట్‌బౌలర్‌.. ‘‘టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ముగిసిన తర్వాత  ఈ ఫార్మాట్‌కు కోహ్లి రిటైర్మెంట్‌ ప్రకటించే అవకాశం ఉంది. 

నేనైతే అలాగే చేస్తాను.. ఎందుకంటే!
అయితే, మిగతా ఫార్మాట్లలో మాత్రం అతడు కొనసాగుతాడు. ఒకవేళ నేను గనుక అతడి స్థానంలో ఉండి ఉంటే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకునేవాడిని. మిగిలిన రెండు ఫార్మాట్లపై మరింత ఎక్కువ దృష్టి సారించి.. కెరీర్‌ను కొనసాగించే అవకాశం దొరుకుతుంది’’ అని ఇండియా డాట్‌కామ్‌ సెషన్‌లో పేర్కొన్నాడు. 

కాగా గతేడాది ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్‌-2022 టోర్నీ జరుగనుంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇక ప్రపంచకప్‌ కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో రోహిత్‌ సేన వరుస సిరీస్‌లు ఆడనుంది.

చదవండి: 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'‌.. ఎంతైనా పాక్‌ క్రికెటర్‌!
పవర్‌ హిట్టర్‌ రీ ఎంట్రీ.. టి20 ప్రపంచకప్‌కు విండీస్‌ జట్టు

మరిన్ని వార్తలు