T20 WC SL Vs NED: సూపర్‌-12కు శ్రీలంక.. నెదర్లాండ్స్‌ ఇంటికి; అద్భుతం జరిగితే తప్ప 

20 Oct, 2022 13:12 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు సూపర్‌-12కు అర్హత సాధించింది. గ్రూఫ్‌-ఏలో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయింగ్‌ పోరులో లంక జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చిన మాక్స్‌ ఓడౌడ్‌ (53 బంతుల్లో 71 పరుగులు, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)చివరి వరకు నాటౌట్‌గా నిలిచినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. మిడిల్‌ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయిన నెదర్లాండ్స్‌ ఆఖర్లో దాటిగా ఆడినప్పటికి లాభం లేకపోయింది. లంక బౌలర్లలో వనిందు హసరంగా మూడు వికెట్లతో చెలరేగగా.. మహీష్‌ తీక్షణ 2, లాహిరు కుమారా, బిహురా ఫెర్నాండోలు చెరొక వికెట్‌ తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  లంక ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌(44 బంతుల్లో 79, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరవగా.. చరిత్‌ అసలంక 31 పరుగులు, బానుక రాజపక్స 19 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో బాస్‌ డీ లీడే , పాల్‌ వాన్‌ మీక్రెన్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. ఫ్రెడ్‌ క్లాసెన్‌, టిమ్‌ వాన్‌డర్‌ గగ్టెన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

ఈ విజయంతో లంక జట్టు సూపర్‌-12కు అర్హత సాధించగా.. నెదర్లాండ్స్‌ ఇంటిబాట పట్టింది. అయితే ఇవాళ యూఏఈతో జరిగే మ్యాచ్‌లో నమీబియా ఓడితే అప్పుడు నెదర్లాండ్స్‌కు సూపర్‌-12 వెళ్లే అవకాశముంది. కానీ నమీబియా ఉన్న ఫామ్‌ దృశ్యా ఏదైనా అద్బుతం జరిగితే తప్ప నెదర్లాండ్స్‌ దాదాపు ఇంటికి వెళ్లినట్లే. ఇక 79 పరుగులతో లంక విజయంలో కీలకపాత్ర పోషించిన కుశాల్‌ మెండిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

చదవండి: స్లో ఓవర్‌ రేట్.. క్రికెట్‌ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన

Ind Vs Pak: పాక్‌తో తొలి మ్యాచ్‌.. పంత్‌, అశ్విన్‌, హుడాకు నో ఛాన్స్‌!

మరిన్ని వార్తలు