Yuvraj Singh Six 6s: యువీ సిక్స్‌ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. కన్నార్పకుండా చూస్తూ మరీ!

19 Sep, 2022 12:05 IST|Sakshi
కొడుకుతో యువరాజ్‌ సింగ్‌(PC: Yuvraj Singh Twitter)

Yuvraj Singh Celebrates Six 6s- Video Viral: టీ20 ప్రపంచకప్‌-2007లో నాటి టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఘటన ప్రతి అభిమాని మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందడనంలో సందేహం లేదు. ఇంగ్లండ్‌తో సెప్టెంబరు 19 నాటి మ్యాచ్‌లో యువీ పూనకం వచ్చినట్టుగా ఊగిపోయాడు. మ్యాచ్‌ 19వ ఓవర్లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్స్‌లు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న యువీ.. 7 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 58 పరుగులు సాధించాడు. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 218 పరుగుల భారీ స్కోరు చేయడం సహా 18 పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా పదిహేనేళ్లు.

ముద్దుల కొడుకుతో కలిసి..
ఈ సందర్భంగా క్రికెట్‌ ప్రేమికులు, యువీ అభిమానులు ఈ అద్భుత ఇన్నింగ్స్‌ను గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే, యువరాజ్‌ మాత్రం ఓ స్పెషల్‌ పార్ట్‌నర్‌తో కలిసి తన చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ తాలుకు సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నాడు.

బుడ్డోడు సైతం కన్నార్పకుండా..
ఆ పార్ట్‌నర్‌ మరెవరో కాదు యువీ ముద్దుల తనయుడు ఓరియన్‌ కీచ్‌ సింగ్‌. కుమారుడితో కలిసి ప్రపంచకప్‌లో తన సిక్సర్ల విధ్వంసం వీక్షిస్తున్న వీడియోను యువరాజ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో కొడుకును ఒళ్లో కూర్చోబెట్టుకుని యువీ ఎంజాయ్‌ చేస్తుండగా.. బుడ్డోడు సైతం కన్నార్పకుండా తండ్రి ఆటను చూస్తూ ఉండిపోవడం విశేషం. ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే.. 2007లో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో మొత్తంగా 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. ఇందులో 8 అర్ధ శతకాలు ఉన్నాయి. మొత్తంగా 28 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఆల్‌రౌండర్‌.

ఇక అన్ని ఫార్మాట్లలో తనదైన ముద్ర వేసిన యువరాజ్‌ సింగ్‌ను పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సముచిత రీతిలో గౌరవించింది. మొహాలీలో స్టేడియంలోని ఓ స్టాండ్‌కు యువీ పేరును పెట్టగా.. ఆస్ట్రేలియాతో భారత్‌ టీ20 సిరీస్‌ ఆరంభం కానున్న సందర్భంగా మంగళవారం దీనిని ఆవిష్కరించనున్నారు. 

కాగా యువరాజ్‌ సింగ్‌.. నటి హజెల్‌ కీచ్‌ను 2016లో వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఈ ఏడాది జనవరిలో కుమారుడు జన్మించాడు. అతడికి ఓరియన్‌ కీచ్‌ సింగ్‌గా నామకరణం చేశారు.

చదవండి: T20 WC: యువ పేసర్‌పై రోహిత్‌ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా!

>
మరిన్ని వార్తలు