T20 WC: చెత్త ప్రదర్శన.. ప్రపంచకప్‌ ఆడటానికి వచ్చారా.. టూరిస్ట్‌ వీసా మీద ఉన్నారా?

26 Oct, 2021 11:08 IST|Sakshi

Aakash Chopra Comments on West Indies South Africa clash: టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో వెస్టిండీస్‌ ఆట తీరును టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా తీవ్రంగా తప్పుబట్టాడు. విండీస్‌ క్రికెటర్లు ప్రపంచకప్‌ ఆడటానికి వచ్చారో.. లేదంటే... యూఏఈ ట్రిప్‌ ఎంజాయ్‌ చేయడానికి వచ్చారో అర్థం కావడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా 2016 పొట్టి ఫార్మాట్‌ టోర్నీ జగజ్జేతగా నిలిచిన వెస్టిండీస్‌... డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగింది. ఆనాటి ఫైనల్‌ మ్యాచ్‌కు కొనసాగింపు అన్నట్లు ఈ ఏడాది తమ తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌తో తలపడింది.

అయితే, ఈ మ్యాచ్‌లో  55 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు నమోదు చేసింది. ఆనాడు ఫైనల్‌లో తాము ఓడించిన ఇంగ్లండ్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలై అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో సూపర్‌-12లో భాగంగా మంగళవారం(అక్టోబరు 26న) దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు.. వెస్టిండీస్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందించాడు. ‘‘టోర్నీలో తమ తొలి మ్యాచ్‌లలో ఓడిపోయిన ఇరు జట్ల మధ్య నేడు పోటీ. దక్షిణాఫ్రికా పోరాడి ఓడింది.

కానీ.. డిఫెండింగ్‌ చాంపియన్స్‌ వెస్టిండీస్‌కు ఏమైందో తెలియదు. నిజానికి వాళ్లు టీ20 వరల్డ్‌కప్‌ ఆడటానికి వచ్చారో.. లేదంటే టూరిస్ట్‌ వీసా మీద దుబాయ్‌లో ఉన్నారో తెలియడం లేదు. తుదిజట్టులో ఎవరెవరు ఉంటారో తెలియదు. ఇది ఎలాంటి జట్టు అంటే... కుదిరితే 225 పరుగులు చేస్తుంది. లేదంటే... కనీసం 125 పరుగులు చేయలేక చతికిలపడుతుంది. గత మ్యాచ్‌లో ఏం జరిగిందో చూశాం కదా. 55 పరుగులకే చేతులెత్తేశారు. ఇదీ పరిస్థితి’’ అంటూ పొలార్డ్‌ బృందాన్ని తీవ్రంగా విమర్శించాడు. 

ఇక విండీస్‌ జట్టులో యువ ఆటగాళ్లు లేరన్న ఆకాశ్‌ చోప్రా... ‘‘ఒక్కోసారి వారిలో మితిమీరిన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మేం చాంపియన్స్‌.. ప్రతీ టీ20 మ్యాచ్‌ను ఎంతో తేలికగా ఆడేస్తాం అన్నట్లు ప్రవర్తిస్తారు. నిజానికి.. ఆ జట్టులో రవి రాంపాల్‌, డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ గేల్, లెండిల్‌ సిమన్స్‌‌... వంటి వయసైపోయిన ఆటగాళ్లు ఉన్నారు. సుదీర్ఘకాలంగా వాళ్లంతా క్రికెట్‌ ఆడుతున్నారు.

వాళ్లకు అవకాశాలు ఇవ్వడం తప్పుకాదు. అయితే, అనుభవానికి తగిన ప్రదర్శన కనబరచాల్సి ఉంటుంది. నాకు తెలిసి దక్షిణాఫ్రికాతో విండీస్‌కు ఇబ్బంది తప్పదు. వాళ్ల బౌలింగ్‌ను వీళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా మంగళవారం జరుగబోయే పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ మ్యాచ్‌ గురించి కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా గ్రూపు-1లో ఉన్న దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో, విండీస్‌ ఇంగ్లండ్‌ చేతిలో పరాజయంతో తమ టీ20 వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

చదవండి: Rashid Khan: కన్నీటి పర్యంతమైన నబీ.. రషీద్‌ ఖాన్‌ భావోద్వేగ పోస్టు..
T20 WC 2021 IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు

>
Poll
Loading...
మరిన్ని వార్తలు