T20 World Cup 2021: ఆ జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి పోరు.. టీమిండియా పరిస్థితి ఏంటో!

7 Nov, 2021 09:18 IST|Sakshi

న్యూజిలాండ్‌ ఓడిపోతేనే భారత్‌ సెమీస్‌ అవకాశాలు సజీవం

టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు సూపర్‌–12 దశలో నిష్క్రమిస్తుందా లేక సెమీస్‌ రేసులో ఉంటుందా అనేది నేడు తేలిపోనుంది. అఫ్గానిస్తాన్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య నేటి మధ్యాహ్నం జరిగే గ్రూప్‌–2 లీగ్‌ మ్యాచ్‌ ఈ రెండు జట్లతోపాటు భారత్‌కూ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే న్యూజిలాండ్‌ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్, అఫ్గానిస్తాన్‌ కథ ముగుస్తుంది.  

ఒకవేళ అఫ్గానిస్తాన్‌ జట్టు విజయం సాధిస్తే మాత్రం న్యూజిలాండ్‌ ప్రస్థానం ముగుస్తుంది. భారత్‌ సెమీస్‌ రేసులో నిలుస్తుంది. న్యూజిలాండ్‌ను అఫ్గానిస్తాన్‌ ఓడించినప్పటికీ ఆ జట్టుకు సెమీస్‌ బెర్త్‌ అనేది భారత్, నమీబియా మధ్య సోమవారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.  
(చదవండి: అజహరుద్దీన్‌-సంగీతల బ్రేకప్‌ లవ్‌స్టోరీ)

రన్‌రేట్‌ విషయంలో అఫ్గానిస్తాన్‌ (1.481), న్యూజిలాండ్‌ (1.277) జట్లకంటే భారత్‌ (1.619) మెరుగ్గా ఉంది. ఒకవేళ న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్‌ అద్భుతం చేసి గెలిస్తే... నమీబియాను ఎంత తేడాతో ఓడిస్తే తమకు సెమీస్‌ బెర్త్‌ ఖరారవుతుందనే విషయం భారత్‌కు కచ్చి తంగా తెలుస్తుంది కాబట్టి టీమిండియా ఓడితేనే అఫ్గానిస్తాన్‌కు సెమీస్‌ బెర్త్‌ లభిస్తుంది.  

ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా అఫ్గానిస్తాన్‌ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోయే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. న్యూజిలాండ్‌ పేస్‌ బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌ ముందు అఫ్గానిస్తాన్‌ ఏమేరకు నిలుస్తుందో వేచి చూడాలి. అంతర్జాతీయ టి20ల్లో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్‌ ముఖాముఖిగా తొలిసారి తలపడనున్నాయి.
(చదవండి: T20 WC 2021: బ్రావోతో కలిసి డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్‌)

మరిన్ని వార్తలు