T20 World Cup 2021: ఆసీస్‌ ఏం చేస్తుందో... దక్షిణాఫ్రికాకు అదే సానుకూలాంశం..

23 Oct, 2021 07:16 IST|Sakshi

పదండి ‘పన్నెండు’ పోరుకు...

నేటి నుంచి టి20 ప్రపంచకప్‌ ‘సూపర్‌ –12’ మ్యాచ్‌లు

తొలి పోరులో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ‘ఢీ’  

ఇంగ్లండ్‌తో తలపడనున్న వెస్టిండీస్‌  

T20 World Cup 2021: ధనాధన్‌ పోరులో రెండో అంకానికి రంగం సిద్ధం. 16 జట్ల సమరం 12 జట్లకు మారింది. వినోదం మాత్రం అంతకంటే రెట్టింపు కానుంది. టాప్‌ టీమ్‌ల మధ్య హోరాహోరీకి నేటితో తెర లేవనుండగా, మెగా టోర్నీని గెలుచుకునే లక్ష్యం దిశగా తొలి మ్యాచ్‌ నుంచే సత్తా చాటాలని జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఒక్కసారి కూడా పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడని రెండు అగ్రశ్రేణి జట్లు ఈ సారైనా కల నెరవేర్చుకునేందుకు శుభారంభంపై దృష్టి పెట్టాయి.

ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తేల్చుకునేందుకు పదునైన అస్త్రాలతో భారత్‌ రేపు రంగంలోకి దిగనుంది. నవంబర్‌ 14న జరిగే ఫైనల్‌ వరకు మెరుపు ప్రదర్శనలు, విధ్వంసకర బ్యాటింగ్‌ విన్యాసాలతో ఈ 23 రోజులు క్రికెట్‌ అభిమానులకు పెద్ద పండగే!   

అబుదాబి: సరిగ్గా ఏడాది క్రితం ఆస్ట్రేలియా గడ్డపై ఏడో టి20 ప్రపంచకప్‌ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా మా వల్ల కాదంటూ ఆ్రస్టేలియా చేతులెత్తేసింది... అక్కడ ఏం జరిగినా మేం మాత్రం షెడ్యూల్‌ ప్రకారం 2021లో మా దేశంలోనే నిర్వహిస్తామని బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ 2021 ఏప్రిల్‌కు వచ్చేసరికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కోవిడ్‌ ఉధృత దశకు చేరుతున్న వేళ క్రికెట్‌ గురించి మాట్లాడే స్థితి లేకపోయింది. పైగా ఐపీఎల్‌కు కరోనా కాటు తగలడంతో రాబోయే ప్రమాదాన్ని ఊహించిన భారత బోర్డు మన దేశంలో మ్యాచ్‌లు నిర్వహించడం అసాధ్యమని తేల్చేసింది.

చివరకు ఆతిథ్యం మనదే కానీ ఆట మాత్రం విదేశాల్లో జరిపేందుకు రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టి20 తొలి దశ పోటీలు శుక్రవారంతో ముగియగా, ముందంజ వేసే జట్లేవో ఖరారైపోయింది. ఇప్పుడు ఈ ‘సూపర్‌–12’ నుంచి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం.  

ఆసీస్‌ ఏం చేస్తుందో! 
సుదీర్ఘ కాలంపాటు క్రికెట్‌ను శాసించినా టి20 ప్రపంచకప్‌ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఆరు టోర్నీలను చూస్తే 2010లో ఫైనల్‌ చేరడం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ప్రస్తుత టీమ్‌లో ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ పేలవ ఫామ్‌లో ఉండటం కలవరపెడుతుండగా... మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్, స్మిత్, స్టొయినిస్‌లను జట్టు నమ్ముకుంది.

ఆ జట్టు పేస్‌ దళం మెరుగ్గానే ఉన్నా... స్పిన్‌కు అనుకూలించే యూఏఈ పిచ్‌లపై జంపా, అగర్‌ స్థాయి బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. మరోవైపు స్టార్లతో నిండి ఉన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరలేదు. ఇప్పుడు పెద్దగా అనుభవంలేని ఆటగాళ్లు ఎక్కువ మందితో కూడిన టీమ్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆడే అవకాశం ఉండటం సానుకూలాంశం.   

చదవండి: T20 WC 2021: చరిత్ర సృష్టించిన నమీబియా; ఆటగాళ్ల సంబరం మాములుగా లేదు

Poll
Loading...
మరిన్ని వార్తలు