T20 World Cup 2021 WI Vs BAN: వరుస పరాజయాలు... టోర్నీ నుంచి అవుట్‌!

30 Oct, 2021 07:34 IST|Sakshi

వీరాభిమానుల ఆశలు ఆవిరి చేస్తూ... ఉత్కంఠ పోరులో తడబడిన బంగ్లాదేశ్‌ టి20 ప్రపంచకప్‌లో వరుసగా మూడో పరాజయం చవిచూసింది. కీలక సమయంలో బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన బంగ్లాదేశ్‌ జట్టు మూల్యం చెల్లించుకుంది. వెస్టిండీస్‌ చేతిలో మూడు పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్‌ ఈ మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్‌ చేరే అవకాశాలను చేజార్చుకుంది. 

Bangladesh Lost To West Indies By 3 Runs Out Tourney: అత్యున్నత వేదికపై మంచి ఫలితాలు రావాలంటే ఆద్యంతం నిలకడగా రాణించాల్సి ఉంటుంది. లేదంటే ఎంతటి మేటి జట్టుకైనా భంగపాటు తప్పదు. వీరాభిమానులకు కొదువలేని బంగ్లాదేశ్‌ జట్టు అంచనాలను అందుకోవడంలో విఫలమై టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన చోట బంగ్లాదేశ్‌ చతికిలపడింది. ఈసారికి సూపర్‌–12తోనే సరిపెట్టుకోనుంది.

చివరి బంతికి 4 పరుగులు అవసరం
గ్రూప్‌–1 లో శుక్రవారం షార్జాలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ మూడు పరుగుల తేడా తో బంగ్లాదేశ్‌ను ఓడించి ఎట్టకేలకు ఈ టోర్నీలో గెలుపు బోణీ కొట్టింది. విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్‌ 9 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బంగ్లాదేశ్‌ గెలుపునకు చివరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి.

విండీస్‌ ఆల్‌రౌండర్‌ రసెల్‌ వేసిన బంతిపై క్రీజులో ఉన్న బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మహ్ముదుల్లా ఒక్క పరుగూ తీయలేకపోయాడు. దాంతో విండీస్‌ విజయం, బంగ్లాదేశ్‌ ఓటమి ఖాయమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది.

నికోలస్‌ పూరన్‌ దూకుడు
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నికోలస్‌ పూరన్‌ (22 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడగా... తొలి టి20 మ్యాచ్‌ ఆడిన రోస్టన్‌ చేజ్‌ (46 బంతుల్లో 39; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఛేదనలో బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసింది. లిటన్‌ దాస్‌ (43 బంతుల్లో 44; 4 ఫోర్లు), కెప్టెన్‌ మహ్ముదుల్లా (24 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా జట్టును విజయతీరానికి చేర్చలేకపోయారు.

స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (బి) మెహదీ హసన్‌ 4; లూయిస్‌ (సి) ముష్ఫికర్‌ (బి) ముస్తఫిజుర్‌ 6; రోస్టన్‌ చేజ్‌ (బి) ఇస్లామ్‌ 39;  హెట్‌మైర్‌ (సి) సౌమ్య సర్కార్‌ (బి) మెహదీ హసన్‌ 9; పొలార్డ్‌ (నాటౌట్‌) 14; రసెల్‌ (రనౌట్‌) 0; పూరన్‌ (సి) నైమ్‌ (బి) ఇస్లామ్‌ 40; బ్రావో (సి) సౌమ్య సర్కార్‌ (బి) ముస్తఫిజుర్‌ 1; హోల్డర్‌ (నాటౌట్‌) 15;

ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142.
వికెట్ల పతనం: 1–12, 2–18, 3–32, 4–62, 5–119, 6–119, 7–123. 
బౌలింగ్‌: మెహదీ హసన్‌ 4–0–27–2, తస్కిన్‌ అహ్మద్‌ 4–0–17–0, ముస్తఫిజుర్‌ 4–0–43–2, షోరిఫుల్‌ 4–0–20–2, షకీబ్‌ 4–0–28–0. 

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: నైమ్‌ (బి) హోల్డర్‌ 17; షకీబ్‌ (సి) హోల్డర్‌ (బి) రసెల్‌ 9; లిటన్‌ దాస్‌ (సి) హోల్డర్‌ (బి) బ్రావో 44; సౌమ్య సర్కార్‌ (సి) గేల్‌ (బి) హొసీన్‌ 17; ముష్ఫికర్‌ (బి) రాంపాల్‌ 8; మహ్ముదుల్లా (నాటౌట్‌) 31; అఫిఫ్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 139. 
వికెట్ల పతనం: 1–21, 2–29, 3–60, 4–90, 5–130. బౌలింగ్‌: రవి రాంపాల్‌ 4–0– 25–1, హోల్డర్‌ 4–0–22–1, రసెల్‌ 4–0– 29–1, హొసీన్‌ 4–0–24–1, బ్రావో 4–0– 36–1.

మరిన్ని వార్తలు