T20 World Cup 2021: అలా అయితేనే టీమిండియా సెమీస్‌కు.. లేదంటే..

27 Oct, 2021 14:50 IST|Sakshi

T20 World Cup 2021 Chances Of India Will Be In Semi Finals Explained: ‘‘పాకిస్తాన్‌ విజయంలో భారత అభిమానుల ప్రార్థనలు కూడా ఉన్నాయి... పాక్‌ న్యూజిలాండ్‌ను ఓడించడం వాళ్లకు సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే.. మనం ఈరోజు కివీస్‌ చేతిలో ఓడి ఉంటే కోహ్లి సేన ఇబ్బందుల్లో పడేది. ఒక రకంగా మనం వాళ్లను సేవ్‌ చేసినట్లే.. ఫైనల్‌లో టీమిండియా కోసం ఎదురుచూద్దాం’’- అక్టోబరు 26న పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌ను ఓడించిన తర్వాత ఆ దేశ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి.

అవును.. నిజమే అతడు అన్న మాటల్లో వాస్తవం ఉంది. ఒకవేళ పాక్‌ గనుక కివీస్‌పై విజయం సాధించకపోయి ఉంటే కోహ్లి సేన కష్టాల్లో పడేది. టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలో ముందుకు సాగాలంటే.. భారత్‌తో పాటు పాకిస్తాన్‌ కూడా విలియమ్సన్‌ బృందంపై తప్పక గెలుపొంది తీరాలి. బాబర్‌ ఆజం టీమ్‌ వాళ్ల పని పూర్తి చేసింది. ఇక అక్టోబరు 31 నాటి మ్యాచ్‌లో టీమిండియా కివీస్‌ను చిత్తు చేస్తేనే సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది. అదెలాగో ఓ సారి పరిశీలిద్దాం.

సూపర్‌-12.. గ్రూపు-2
టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీ సూపర్‌-12లో రెండు గ్రూపు-1, గ్రూప్‌-2లు ఉన్నాయి. క్వాలిఫైయర్స్‌లో భాగంగా గ్రూపు-ఏ, గ్రూపు-బి టాపర్లుగా నిలిచిన నాలుగు జట్లలో.. గ్రూపు-1లో రెండు, గ్రూపు-2లో రెండు చేరాయి.

ఆ రెండు పసికూనలు
గ్రూపు-2 విషయానికొస్తే.. సూపర్‌-12కు నేరుగా అర్హత సాధించిన.. 4 జట్లలో భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌ ఉన్నాయి. లీగ్‌ దశలో భాగంగా.. తొలిసారిగా టోర్నీకి అర్హత సాధించిన నమీబియాతో పాటు స్కాట్లాండ్‌ సంచలన విజయాలు నమోదు చేసి ఈ గ్రూప్‌లో చేరాయి.

పాకిస్తాన్‌ సంగతి ఇది
ఇక పాయింట్ల పరంగా చూసుకుంటే... పాకిస్తాన్‌ ఇప్పటికే టీమిండియా, న్యూజిలాండ్‌పై వరుస విజయాలతో 4 పాయింట్లు సాధించింది. తద్వారా ప్రస్తుతం గ్రూపు-2 టాపర్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలో తమకు తదుపరి మ్యాచ్‌లలో ఎదురయ్యే పసికూనలు అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్‌ను ఓడిస్తే.. మరో ఆరు పాయింట్లు.. అంటే మొత్తంగా 10 పాయింట్లు వస్తాయి. దీంతో సెమీస్‌ బెర్తు దాదాపు ఖాయమైనట్లే. బాబర్‌ ఆజం బృందం ఫామ్‌ చూస్తుంటే సెమీ ఫైనల్‌ చేరడం అంతకష్టం కాదని స్పష్టమవుతోంది.

అఫ్గనిస్తాన్‌ సంచలన విజయంతో
మరోవైపు.. స్కాట్లాండ్‌పై 130 పరుగుల తేడాతో విజయం సాధించి అప్గనిస్తాన్‌(2 పాయింట్లు) సైతం బోణీ కొట్టింది. రన్‌రేటు పరంగా పాకిస్తాన్‌ కంటే కూడా ఎంతో మెరుగ్గా ఉంది. ఆ జట్టును కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.

టీమిండియా ప్రతీ మ్యాచ్‌ గెలిస్తేనే
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియాకు ఇకపై ఆడే ప్రతీ మ్యాచ్‌ కీలకంగా మారింది. గెలిస్తేనే ముందుకు సాగే పరిస్థితి. గ్రూపు-2లో మిగిలిన మూడు చిన్న జట్లతో పాటు బలమైన న్యూజిలాండ్‌ను కోహ్లి సేన తప్పక ఓడించాలి. అలా అయితేనే భారత్‌కు 8 పాయింట్లు వస్తాయి. ఇదిలా ఉంటే... న్యూజిలాండ్‌ది కూడా ఇదే పరిస్థితి.

ఇంతవరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు కాబట్టి... మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం నాటి పోరు ఇరు జట్లకు కీలకంగా మారింది. ఒకవేళ పాకిస్తాన్‌ గనుక కివీస్‌ను ఓడించి ఉండకపోతే... మన పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. కాగా గ్రూపు-1, గ్రూపు-2లో టాప్‌-2గా నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయన్న సంగతి తెలిసిందే.

చదవండి: Shoaib Malik: సెలక్టర్ల నిర్ణయం సరైందేనని నిరూపించాడు: జహీర్‌ ఖాన్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు