Chris Morris: దక్షిణాఫ్రికాతో ఆట ముగిసినట్లే.. క్రిస్‌ మోరిస్‌ ఆవేదన

28 Oct, 2021 16:45 IST|Sakshi

All Rounder Chris Morris Statement Not Playing South Africa.. బ్లాక్‌లైవ్‌ మ్యాటర్స్‌ మూమెంట్‌ మద్దతు విషయంలో డికాక్‌ వివాదం మరిచిపోకముందే సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డుకు మరోషాక్‌ తగిలింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్‌ మోరిస్‌ ఇకపై దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ఆడే రోజులు పూర్తయ్యాయంటూ సంచలన ప్రకటన చేశాడు. క్రిస్‌ మోరిస్‌ తాజా ప్రకటనతో క్రికెట్‌ సౌతాఫ్రికా బోర్డు(సీఎస్‌ఏ) తెరవెనుక  సంక్షోభం మరోసారి మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. సీఎస్‌ఏ రాజకీయాలతో తానెంత నలిగిపోయాననేది మోరిస్‌ ప్రకటనలో స్పష్టంగా కనిపించింది. 

చదవండి: మోకాలిపై నిలబడకపోవడంపై క్షమాపణలు కోరిన డికాక్‌

దీనికి సంబంధించి మోరిస్‌ మాట్లాడుతూ.. ‘దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కోసం నేను ఆడే రోజులు పూర్తయ్యాయి.అధికారికంగా రిటైర్మెంట్‌పై చెప్పాల్సింది ఏమీ లేదు. నేను దేశవాళీ క్రికెట్ మీద దృష్టి సారించాలనుకుంటున్నాను. దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లకు ఆడాను. నా దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది. నేను ఎక్కడ ఉంటానో (దక్షిణాఫ్రికా బోర్డు ను ఉద్దేశిస్తూ..) వాళ్లకు తెలుసు. అలాగే నేను ఎక్కడ నిలబడగలనో నాకు తెలుసు. కానీ జాతీయ జట్టు కోసం ఆడే రోజులు మాత్రం పూర్తయ్యాయి. బాధగా ఉన్నప్పటికీ ఇదే నిజం’ అని పేర్కొన్నాడు.  34 ఏండ్ల క్రిస్‌ మోరిస్‌.. దక్షిణాఫ్రికా తరఫున 2012లో క్రికెట్ లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు అతడు 42 వన్డేలు, 23 టీ20లు, నాలుగు టెస్టులు ఆడాడు. జాతీయ జట్టు తరఫున మోరిస్‌ చివరి వన్డేను 2019 ప్రపంచకప్ లో ఆడాడు. 

ఇక యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా తరఫున మోరిస్ తుది జట్టులో లేడు. మోరిస్ తో పాటు స్టార్ ఓపెనర్ డూప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్ లను కూడా ఎంపిక చేయలేదు. దక్షిణాఫ్రికాలో బోర్డు, ఆటగాళ్ల మధ్య కొంతకాలంగా సఖ్యత కొరవడింది. టి20 టోర్నీ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా బోర్డుకు ఆటగాళ్లకు మధ్య ఎన్ని వివాదాలు తలెత్తుతాయో అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: Quinton De Kock: మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు డికాక్‌ ఔట్‌.. కారణం 

>
మరిన్ని వార్తలు