-

T20 World Cup 2021 Ind Vs Pak: ‘లెక్క’ మారింది.. 13-0 అవుతుందనుకుంటే..

25 Oct, 2021 07:37 IST|Sakshi

తొలి మ్యాచ్‌లో భారత్‌కు అనూహ్య ఓటమి

10 వికెట్లతో పాకిస్తాన్‌ ఘన విజయం 

ప్రపంచకప్‌ చరిత్రలో భారత్‌పై పాక్‌కు తొలి గెలుపు

రాణించిన షాహిన్‌ అఫ్రిది, రిజ్వాన్, బాబర్‌

31న న్యూజిలాండ్‌తో భారత్‌ తర్వాతి పోరు 

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అంటే భారత్‌దే గెలుపు... సూర్యుడు తూర్పున ఉదయించును అనేది ఎంత వాస్తవమో ఇదీ అంతే అన్నంతగా మూడు దశాబ్దాలుగా ముద్ర పడిపోయింది... ప్రత్యర్థితో పోలిస్తే అన్ని రకాలుగా పటిష్టంగా కనిపించిన టీమిండియా స్కోరు 13–0 చేయడం ఖాయమని సగటు భారత క్రికెట్‌ అభిమాని కూడా నమ్మాడు... ఎప్పటిలాగే మన జట్టుపై అంచనాలతో ఆదివారం రాత్రి వినోదానికి సన్నద్ధమయ్యాడు. కానీ ఆ భ్రమలు వీడిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. రోహిత్‌ శర్మ డకౌట్‌తో మొదలైన పతనం చివరకు ఓటమి వరకు సాగింది.

మిసైల్‌లాంటి బంతులతో షాహిన్‌ అఫ్రిది దెబ్బ కొట్టిన తర్వాత భారత్‌ ఇక కోలుకోలేకపోయింది. తక్కువ స్కోరు తర్వాత పాక్‌ను నిలువరించడంలో కూడా కోహ్లి సేన అసహాయత కనిపించింది. ఒక్క వికెట్‌ తీయలేకపోగా... కనీసం వికెట్‌ తీసే అవకాశాలు కూడా సృష్టించలేకపోయారు. ఫలితంగా టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి దాయాది చేతిలో ఓటమి. 

దుబాయ్‌: ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్‌ జట్టుకు భారత్‌పై తొలి విజయం దక్కింది. గతంలో వన్డే, టి20 ఫార్మాట్‌లలో కలిపి 12 సార్లు తలపడితే ప్రతీసారి ఓడిన పాక్‌ ఇప్పుడు ఆ లెక్కను మార్చింది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ను 10 వికెట్లతో చిత్తు చేసి వరల్డ్‌ కప్‌లో శుభారంభం చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాహిన్‌ అఫ్రిది (3/31) దెబ్బ తీశాడు. అనంతరం పాక్‌ 17.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 152 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు మొహమ్మద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా జట్టును గెలిపించారు.  

రోహిత్‌ డకౌట్‌... 
లెఫ్టార్మ్‌ పేసర్‌ షాహిన్‌ అఫ్రిది ఆరంభంలోనే భారత్‌కు షాక్‌ ఇచ్చాడు. అఫ్రిది అద్భుత యార్కర్‌కు రోహిత్‌ శర్మ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయి ‘గోల్డెన్‌ డక్‌’గా వెనుదిరిగాడు. రోహిత్‌ కనీసం రివ్యూ ఆలోచన కూడా చేయలేదు. తన తర్వాతి ఓవర్‌ తొలి బంతికే రాహుల్‌ (3)ను కూడా షాహిన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తొలి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ ఆడుతున్న సూర్యకుమార్‌ (11) కూడా ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవకపోవడంతో భారత్‌ పవర్‌ప్లే లోపే 31 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.  

అర్ధ సెంచరీ భాగస్వామ్యం... 
ప్రతికూల పరిస్థితుల్లో కోహ్లి బాధ్యతగా ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌ భారత్‌ను మెరుగైన స్థితికి చేర్చింది. గత మూడు టి20 ప్రపంచకప్‌ల తరహాలోనే ఈసారి కూడా అతను పాక్‌పై తన క్లాసిక్‌ ఆటను ప్రదర్శించాడు. మరోవైపు నుంచి పంత్‌ చూపించిన దూకుడుతో జోరు పెరిగింది. ముఖ్యంగా హసన్‌ అలీ ఓవర్లో వరుస బంతుల్లో ఒంటిచేత్తో పంత్‌ కొట్టిన రెండు సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరు 40 బంతుల్లో 53 పరుగులు జోడించిన అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయత్నించి పంత్‌ వెనుదిరిగాడు.  

5 ఓవర్లలో 51 పరుగులు... 
సరిగ్గా 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత భారత్‌ మరింత వేగంగా పరుగులు రాబట్టడంలో సఫలమైంది. ముఖ్యంగా హసన్‌ అలీ వేసిన 2 ఓవర్లలో 4 ఫోర్లతో కలిపి భారత్‌ 23 పరుగులు సాధించింది. ఈ క్రమంలో 45 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. షాహిన్‌ వేసిన 19వ ఓవర్‌ భారత్‌కు బాగా కలిసొచ్చింది. నోబాల్, ఓవర్‌త్రోలు సహా మొత్తం 17 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్లో కోహ్లి కూడా వెనుదిరగడంతో పాక్‌పై ప్రపంచ కప్‌లో అతను తొలిసారి అవుటైనట్లయింది.  

ఆడుతూ పాడుతూ... 
సాధారణ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ జట్టుకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. ఓపెనింగ్‌ భాగస్వాములుగా మంచి రికార్డు ఉన్న రిజ్వాన్, బాబర్‌ దానిని ఇక్కడా కొనసాగించారు. ఏమాత్రం తడబాటు లేకుండా, ప్రశాంతంగా ఆడి పని పూర్తి చేశారు. ఏ దశలోనూ భారత బౌలర్లు పాక్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. భువీ వేసిన తొలి ఓవర్లో పది పరుగులతో మొదలు పెట్టిన పాక్‌ పవర్‌ప్లేలో 43 పరుగులు చేసింది. సగం ఇన్నింగ్స్‌ ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. ఆ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించిన వీరిద్దరు వేగంగా లక్ష్యం దిశగా జట్టును నడిపించారు.

ఈ క్రమంలో బాబర్‌ 40 బంతుల్లో, రిజ్వాన్‌ 41 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 12.5 ఓవర్లకు స్కోరు 100 పరుగులకు చేరిన తర్వాత పాక్‌ గెలుపు లాంఛనమే అయింది. భారత బౌలర్లలో షమీ బాగా నిరాశపర్చగా... అంచనాలు పెట్టుకున్న మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి వాటిని అందుకోలేకపోయాడు. వరుణ్‌ తొలి 3 ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్‌ చేసినా, వికెట్‌ తీయడంలో మాత్రం విఫలమయ్యాడు. మంచు ప్రభావం కొంత వరకు ఉన్నా, భారత బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Virat Kohli: వాళ్లు బాగా ఆడారు.. అయినా ఇదే చివరి మ్యాచ్‌ కాదు కదా
T20 World Cup 2021 SL Vs Ban: అంచనాల్లేకుండా బరిలోకి.. వరుస విజయాలతో..

మరిన్ని వార్తలు