T20 WC 2021 IND Vs PAK: భారత బౌలర్‌పై పాక్‌ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు

25 Oct, 2021 18:43 IST|Sakshi

Salman Butt Takes A Dig At Varun Chakaravarthy: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి తేలిపోవడంపై పాక్‌ మాజీ సారధి సల్మాన్‌ బట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరుణ్‌ సంధించిన మిస్టరీ బంతులను పాక్‌లో గల్లీ పోరలు రోజూ ఎదుర్కొంటారని.. వేళ్లతో ట్రిక్స్ చేస్తూ బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టే ప్రయత్నం చేయడం పాక్‌లో సర్వసాధారణమని.. అందుకే వరుణ్‌ను పాక్‌ ఓపెనర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారని తెలిపాడు.

పాక్‌పై మిస్టరీ బౌలింగ్‌ ప్రభావం నామమాత్రమేనని, గతంలో శ్రీలంక స్పిన్నర్‌ అజంతా మెండిస్‌ సైతం పాక్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాడని అన్నాడు. 2003-04 పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టు సభ్యుడు ఇర్ఫాన్‌ పఠాన్‌పై కూడా అప్పటి పాక్‌ కోచ్‌ జావిద్‌ మియాందాద్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇర్ఫాన్‌ లాంటి బౌలర్లు పాక్‌లో  వీధికొకరు ఉంటారని అవమానించాడు. కాగా, నిన్న పాక్‌తో మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి 4 ఓవర్లు బౌల్‌ చేసి 33 పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే.  

ఇదిలా ఉంటే,  ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్‌కు భారత్‌పై తొలి విజయం దక్కింది. ఆదివారం జరిగిన పోరులో పాక్‌ 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి ప్రపంచ కప్‌లో శుభారంభం చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (49 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (30 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడగా...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షాహిన్‌ అఫ్రిది (3/31) టీమిండియాను దెబ్బ తీశాడు. అనంతరం పాక్‌ 17.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 152 పరుగులు చేసి చారిత్రక విజయం నమోదు చేసింది. ఓపెనర్లు మహ్మ​ద్‌ రిజ్వాన్‌ (55 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు.  
చదవండి: IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు

మరిన్ని వార్తలు