T20 World Cup 2021 Nz Vs Nam: నమీబియాపై ఘన విజయం.. సెమీస్‌కు చేరువలో కివీస్‌!

6 Nov, 2021 07:58 IST|Sakshi
PC: ICC

న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌

52 పరుగులతో నమీబియాపై విజయం

సెమీస్‌ అవకాశాలు మెరుగు

రాణించిన ఫిలిప్స్, నీషమ్‌

New Zealand Beat Namibia By 52 Runs Close To Semis: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. నమీబియాను భారీ తేడాతో ఓడించింది. గ్రూప్‌–2 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌ నిరాశపరిచినా మిడిలార్డర్‌ న్యూజిలాండ్‌ను నిలబెట్టింది. బౌలింగ్‌లో బౌల్ట్, సౌతీ దెబ్బతీయడంతో నమీబియా ఏ దశలోనూ లక్ష్యంవైపు నడవలేకపోయింది. వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్‌ రేపు అఫ్గానిస్తాన్‌తో జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.

షార్జా: టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ వరుస విజయాలు సెమీస్‌ అవకాశాల్ని మెరుగు పరుస్తున్నాయి. శుక్రవారం గ్రూప్‌–2లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కివీస్‌ 52 పరుగులతో నమీబియాపై నెగ్గింది. మొదట న్యూజిలాండ్‌ నిరీ్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (21 బంతుల్లో 39 నాటౌట్‌; ఫోర్, 3 సిక్స్‌లు), నీషమ్‌ (23 బంతుల్లో 35 నాటౌట్‌; ఫోర్, 2 సిక్స్‌లు) మెరిపించారు. తర్వాత నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులే చేయగలిగింది. కివీస్‌ బౌలర్లు సౌతీ (2/15), బౌల్ట్‌ (2/20) నిప్పులు చెరిగారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన నీషమ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది.  

కివీస్‌ ఆరంభం చెదిరింది... 
టాస్‌ నెగ్గిన నమీబియా బౌలింగ్‌ ఎంచుకోగా...  బౌలర్లు వీస్, బెర్నార్డ్‌ ఇందుకు తగ్గట్లే న్యూజి లాండ్‌ను ఆరంభంలో వణికించారు. దీంతో ఓపెనర్లు గప్టిల్‌ (18; ఫోర్, సిక్స్‌), మిచెల్‌ (19; 2 ఫోర్లు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 43 పరుగులకే 2 కీలక వికెట్లు నేలకూలాయి. ఈ దశలో కెప్టెన్‌ విలియమ్సన్‌ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్‌), కాన్వే (17; ఫోర్‌)తో కలిసి జట్టును నడిపించాడు. తొలి 10 ఓవర్లలో కివీస్‌ 62/2 స్కోరు చేసింది.

తర్వాత విలియమ్సన్‌... ఎరాస్మస్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ కాగా... స్వల్ప వ్యవధిలో కాన్వే రనౌటయ్యాడు. ఫిలిప్స్, నీషమ్‌ క్రీజులోకి రాగా 16 ఓవర్లు పూర్తయినా కివీస్‌ స్కోరు (96/4) వంద దాటలేదు. కానీ ఇద్దరూ ఆఖరి 4 ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారీ సిక్సర్లతో విరుచకుపడటంతో 24 బంతుల్లోనే 67 పరుగులు వచ్చాయి. స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. 

క్రికెట్‌ కూన నమీబియాకు 164 పరుగుల లక్ష్యం కష్టసాధ్యమైంది. కష్టంగా పవర్‌ ప్లే వరకు వికెట్లు కాపాడుకున్నారు. ఓపెనర్లు బార్డ్‌ (21; 2 ఫోర్లు), వాన్‌ లింగెన్‌ అవుటయ్యాక వచ్చిన వారిలో గ్రీన్‌ (23; ఫోర్, సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ ఏటికి ఎదురీదలేక, కొండలా మారిన లక్ష్యాన్ని కరిగించలేక చేతులెత్తేశారు. 

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) రూబెన్‌ (బి) వీస్‌ 18; మిచెల్‌ (సి) లింగెన్‌ (బి) స్కాట్జ్‌ 19; విలియమ్సన్‌ (బి) ఎరాస్మస్‌ 28; కాన్వే (రనౌట్‌) 17; ఫిలిప్స్‌ (నాటౌట్‌) 39; నీషమ్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–81, 4–87. బౌలింగ్‌: స్కాట్జ్‌ 3–0–15–1, రూబెన్‌ 3–0–25–0, వీస్‌ 4–0–40–1, స్మిట్‌ 2–0–27–0, నికోల్‌ లోఫ్టి 2–0–24–0, ఎరాస్మస్‌ 4–0–22–1, బిర్కెన్‌స్టాక్‌ 2–0–9–0. 

నమీబియా ఇన్నింగ్స్‌: బార్డ్‌ (బి) సాన్‌ట్నర్‌ 21; లింగెన్‌ (బి) నీషమ్‌ 25; ఎరాస్మస్‌ (సి) కాన్వే (బి) సోధి 3; గ్రీన్‌ (సి) బౌల్ట్‌ (బి) సౌతీ 23; వీస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌతీ 16; స్మిట్‌ (నాటౌట్‌) 9; నికోల్‌ లోఫ్టి (సి) గప్టిల్‌ (బి) బౌల్ట్‌ 0; క్రెయిగ్‌ విలియమ్స్‌ (సి) ఫిలిప్స్‌ (బి) బౌల్ట్‌ 0; రూబెన్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 111. 
వికెట్ల పతనం: 1–47, 2–51, 3–55, 4–86, 5–102, 6–103, 7–105. బౌలింగ్‌: సౌతీ 4–0–15–2, బౌల్ట్‌ 4–0–20–2, మిల్నే 4–0–25–0, సాన్‌ట్నర్‌ 4–0–20–1, నీషమ్‌ 1–0–6–1, సోధి 3–0–22–1. 

చదవండి: Virat Kohli: పుట్టినరోజున సంతోషం.. జడ్డూ సూపర్‌.. నవంబరు 7న ఏం జరుగుతుందో మరి!

Poll
Loading...
మరిన్ని వార్తలు