T20 WC 2021 NZ Vs SCO: గప్టిల్‌ ధనాధన్‌... సెమీస్‌ రేసులో న్యూజిలాండ్‌

4 Nov, 2021 07:54 IST|Sakshi

56 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93

స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్‌ విజయం

దుబాయ్‌: చాలా రోజుల తర్వాత మార్టిన్‌ గప్టిల్‌ తన బ్యాట్‌కు పని చెప్పాడు. మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌కు తొలుత భారీ స్కోరును అందించాడు. అనంతరం బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్‌–12 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 16 పరుగులతో నెగ్గింది. గ్రూప్‌–2లో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ (56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌ (37 బంతుల్లో 33; 1 సిక్స్‌) గప్టిల్‌కు సహకారం అందించాడు. ఛేదనలో స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడింది. మైకేల్‌ లిస్క్‌ (20 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడాడు. బౌల్ట్, సోధి చెరో రెండు వికెట్లు తీశారు. గప్టిల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.  

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ డారిల్‌ మిచెల్‌ (13), విలియమ్సన్‌ (0), కాన్వే (1) వికెట్లను త్వరగా కోల్పోయింది. అయితే జట్టును గప్టిల్‌ ఆదుకున్నాడు. గ్లెన్‌ ఫిలిప్స్‌తో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. సెంచరీకి చేరువగా వచ్చిన గప్టిల్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో అవుటయ్యాడు. ఛేదనను స్కాట్లాండ్‌ ఘనంగానే ఆరంభించింది. క్రాస్‌ (27; 5 ఫోర్లు), మున్సీ (22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), బెరింగ్టన్‌ (20; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించడంతో స్కాట్లాండ్‌ లక్ష్యం వైపు కదిలింది. వీరు అవుటయ్యాక స్కాట్లాండ్‌ కాస్త తడబడింది. చివర్లో లిస్క్‌ భారీ షాట్లతో విరుచుకుపడినా అది జట్టుకు  విజయాన్ని అందించలేదు. 

సంక్షిప్త స్కోర్లు 
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: 172/5 (20 ఓవర్లలో) (గప్టిల్‌ 93; గ్లెన్‌ ఫిలిప్స్‌ 33, వీల్‌ 2/40, షరీఫ్‌ 2/28); స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌: 156/5 (20 ఓవర్లలో) (మున్సీ 22, క్రాస్‌ 27, బెరింగ్టన్‌ 20, లిస్క్‌ 42 నాటౌట్, బౌల్ట్‌ 2/29, సోధి 2/42). 

మరిన్ని వార్తలు