T20 WC 2021: ఇంగ్లండ్‌ ఫెవరెట్‌.. న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా!

10 Nov, 2021 10:20 IST|Sakshi

మోర్గాన్‌ జట్టుకు గాయాల బెడద

ఆత్మవిశ్వాసంతో విలియమ్సన్‌ టీమ్‌

రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

New Zeland May Take Revenge On England For 2019 ODI World Cup Final Loss.. టి20 ప్రపంచకప్‌-2021 నాకౌట్‌ పోరుకు వచ్చింది. ఫైనల్‌ బరిలో నిలిచేందుకు నాలుగు జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ముందుగా ‘కప్‌’ వేటలో నిలిచేదెవరో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో తేలుతుంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ మధ్య ఆసక్తికర సమరానికి అబుదాబి వేదిక కాగా... ఈ సారైనా ప్రపంచకప్‌ ముచ్చట తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ తహతహలాడుతోంది.

ఫైనల్లో ఆడుగుపెట్టేందుకు... ఇంగ్లండ్‌ అడ్డంకి తొలగించుకునేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. ప్రధాన ఆటగాళ్లు జేసన్‌ రాయ్, టైమల్‌ మిల్స్‌ గాయాలతో దూరమవడాన్ని అనుకూలంగా మలచుకోవాలని, గత రెండు పరాజయాలకు గట్టి దెబ్బ కొట్టాలని న్యూజిలాండ్‌ చూస్తోంది. 

బట్లర్‌కు జోడీగా బెయిర్‌స్టో 
కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం ఇంగ్లండ్‌ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. అయితే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ముందడుగు వేయాలనే నిశ్చయంతో ఉంది. డాషింగ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ కాలిపిక్క గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ఫామ్‌లో ఉన్న బట్లర్‌కు జోడీగా బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. మరోవైపు ఐసీసీ ప్రపంచకప్‌ టోర్నీల్లోనే కాదు... గడిచిన 21 టి20 మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్‌దే పైచేయి. పొట్టి పోరులో కివీస్‌ ఏడు గెలిస్తే, ఇంగ్లండ్‌ 12 మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.  
జోరు మీదున్న కివీస్‌ 
లీగ్‌ దశలో ఇంగ్లండ్‌ అన్నీ గెలిచి ఆఖరి మ్యాచ్‌లో ఓడితే... కివీస్‌ తొలి మ్యాచ్‌ ఓడాక మిగతావన్నీ గెలుస్తూ ఆత్మవిశ్వాసంతో ఉంది. పైగా ప్రపంచకప్‌లకు అడ్డంకిగా మారిన ఇంగ్లండ్‌ను దెబ్బతీయాలనే లక్ష్యంతో విలియమ్సన్‌ బృందం ఉంది. కెప్టెన్‌ విలియమ్సన్‌ పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్‌ చేస్తూ, ఇన్నింగ్స్‌ను కుదుటపరుస్తూ జట్టును నడిపిస్తున్నాడు.

ఓపెనింగ్‌లో గప్టిల్, మిచెల్‌ మెరుపుదాడి చేస్తే ఆఖరి ఓవర్లలో అదరగొట్టేందుకు... తడబడితే ఆదుకునేందుకు ఫిలిప్స్, నీషమ్‌లతో బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ట్రెంట్‌ బౌల్ట్‌ తన పేస్‌ బౌలింగ్‌తో నిప్పులు చెరుగుతున్నాడు. సౌతీ కూడా రాణిస్తున్నాడు. వీరిద్దరు ఇంగ్లండ్‌ ఆరంభాన్ని చెదరగొడితే కివీస్‌ పట్టుబిగించడం ఖాయం. 

చదవండి: Virat Kohli: ఫెయిలయ్యుండొచ్చు.. కానీ కెప్టెన్‌ అంటే కోహ్లినే

ఐసీసీ ఈవెంట్లలో ఇంగ్లండ్‌ , న్యూజిలాండ్‌ మద్య మ్యాచ్‌ అనగానే మొదటగా అందరికి గుర్తుకు వచ్చేది 2019 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్. ఆ ఫైనల్లో ఇరు జట్లు సమానంగా స్కోర్లు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. అలా సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. సూపర్‌ ఓవర్‌లో కూడా ఇరు జట్లు 15 పరుగులే చేయడంతో మరోసారి టై అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. అలా న్యూజిలాండ్‌కు వన్డే వరల్డ్‌కప్‌లో నిరాశే మిగిలింది. తాజాగా టి20 ప్రపంచకప్‌ 2021లో సెమీస్‌లో మరోసారి ఈ ఇద్దరు తలపడుతుండడంతో కివీస్‌ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌ పిచ్‌ ఇది. అఫ్గాన్‌పై భారత్‌ టోర్నీలోనే అత్యధిక  210/2 స్కోరు ఇక్కడే చేసింది. అందుకేనేమో కివీస్‌ స్పిన్నర్‌ సాన్‌ట్నర్‌ బౌలర్లకు కష్టమే అన్నాడు. వాతావరణంతో ఇబ్బంది లేదు. వాన ముప్పేమీ లేదు. 
చదవండి: T20 WC 2021: క్రికెట్‌ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు