T20 WC Oman Vs PNG: 10 వికెట్ల తేడాతో ఒమన్‌ ఘన విజయం

17 Oct, 2021 15:04 IST|Sakshi

T20 World Cup 2021 Oman vs Papua New Guinea:  టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీలోని ఆరంభ మ్యాచ్‌లో ఒమన్‌ విజయం సాధించింది. మెగా ఈవెంట్‌కు తొలిసారి అర్హత సాధించిన పపువా న్యూగినియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు అకిబ్‌ ఇలియాస్‌ (50), జితేందర్‌ సింగ్‌(73) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచి వరుస ఓవర్లలో వికెట్లు తీసిన ఒమన్‌ కెప్టెన్‌ జీషన్‌ మక్సూద్‌(4)ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

స్కోర్లు:  పపువా న్యూగినియా129/9 (20)
ఒమన్‌ 131/0 (13.4)

ఒమన్‌ ఓపెనర్లు అర్ధ సెంచరీ దిశగా కొనసాగుతున్నారు. అకిబ్‌ ఇలియాస్‌(42), జితేందర్‌ సింగ్‌(42) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి ఒమన్‌ స్కోరు: 88-0.

నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
పపువా న్యూ గినియా విధించిన 130 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్‌ ఓపెనర్లు అకిబ్‌ ఇలియాస్‌, జితేందర్‌ సింగ్‌ మెరుగ్గా ఆడుతున్నారు. ఈ క్రమంలో 5 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేయగలిగింది.

 ఒమన్‌ టార్గెట్‌ 130
టీ20 వరల్డ్‌కప్‌-2021 తొలి మ్యాచ్‌లో ఒమన్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఓపెనర్లు టోని ఉరా, లెగా సియాకా పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా కెప్టెన్‌ అసద్‌ వాలా, చార్లెస్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రపంచ వేదికపై తొలిసారిగా ఆడే అవకాశం దక్కించుకున్న జట్టు కెప్టెన్‌ అసద్‌ (56) అర్ధ సెంచరీతో మెరిశాడు. పపువా ఇన్నింగ్స్‌లో అతడిదే టాప్‌ స్కోర్‌. 

►పపువా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోతోంది. కెప్టెన్‌ అసద్‌(56) అవుట్‌ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన నార్మన్‌ వనువా(1), ఆ వెంటనే  సెసె బా(13)ను ఒమన్‌ కెప్టెన్‌ జీషన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగారు. ఆ తర్వాత కిప్లిన్‌ డోరిగాను కూడా జీషన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 16 ఓవర్లలో 113 పరుగులు చేసిన పపువా 7 వికెట్లు కోల్పోయింది.

కొరకాని కొయ్యగా తయారైన అసద్‌ వాలాను కలీముల్లా పెవిలియన్‌కు పంపాడు. అసద్‌ షాట్‌ ఆడే క్రమంలో జితేందర్‌ సింగ్‌ అద్భుత క్యాచ్‌ అందుకోవడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను అవుట్‌ చేసిన తర్వాత ఒమన్‌ ప్లేయర్‌ జితేందర్‌... టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ స్టైల్‌లో సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. ప్రస్తుతం 

పపువా కెప్టెన్‌ అసద్‌ వాలా హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒమన్‌ సారథి జీషన్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది ఈ టోర్నీలో మొదటి అర్ధ శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో ఆడే అర్హత సాధించిన పపువా న్యూ గినియాకు మధుర జ్ఞాపకాన్ని మిగిల్చాడు.

నాలుగు ఫోర్లు, సిక్సర్‌ బాది 37 పరుగులతో జోరు మీదున్న పపువా బ్యాటర్‌ అమినీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఒమన్‌ బౌలర్‌ మహ్మద్‌ నదీం బౌలింగ్‌లో అసద్‌ వాలాతో సమన్వయ లోపం కారణంగా వికెట్‌ సమర్పించుకున్నాడు. దీంతో పపువా మూడో వికెట​ కోల్పోయింది. ప్రస్తుతం అసద్‌ వాలా, సెసె బా క్రీజులో ఉన్నారు.

ఆరంభంలోనే రెండు వికెట్లు పడ్డా పపువా బ్యాటర్లు అసద్‌ వాలా, చార్లెస్‌ అమిని వరుస షాట్లతో అలరిస్తున్నారు.  అసద్‌ 26, అమిని 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆతిథ్య ఒమన్‌ జట్టుకు శుభారంభం లభించింది. తొలి ఓవర్‌లోనే ఒమన్‌ బౌలర్‌ బిలాల్‌ ఖాన్‌ వికెట్‌ పడగొట్టాడు. పపువా ఓపెనర్‌ టోనీ ఉరాను బౌల్డ్‌ చేశాడు. ఆ వెంటనే మరో ఓపెనర్‌ లెగా సియాకాను కలీముల్లా పెవిలియన్‌కు పంపాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పపువా రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ అసద్‌ వాలా, చార్లెస్‌ అమిని క్రీజులో ఉన్నారు.  

Updates:
పపువా న్యూగినియా జాతీయ గీతాలాపన అనంతరం... ఆతిథ్య ఒమన్‌ గీతాలాపన.

తుది జట్లు: 
పపువా న్యూగినియా: టోనీ ఉరా, అసద్‌ వాలా(కెప్టెన్‌), చార్లెస్‌ అమిని, లెగా సియాకా, నార్మన్‌ వనువా, సెసె బా, సిమన్‌ అటాయి, కిప్లిన​ డొరిగా(వికెట్‌ కీపర్‌), నొసైనా పొకానా, డామిన్‌ రవూ, కబువా మోరియా.

ఒమన్‌: జితేందర్‌ సింగ్‌, ఖవార్‌ అలీ, ఆకిబ్‌ ఇలియాస్‌, జీషన్‌ మక్సూద్‌(కెప్టెన్‌), నసీం ఖుషి(వికెట్‌ కీపర్‌), కశ్యప్‌ ప్రజాపతి, మహ్మద్‌ నదీం, అయాన్‌ ఖాన్‌, సందీప్‌ గౌడ్‌, కలీముల్లా, బిలాల్‌ ఖాన్‌

మస్కట్‌: మరో మహా క్రికెట్‌ సంగ్రామానికి తెర లేచింది. ఐదేళ్ల విరామం తర్వాత ఒమన్‌ వేదికగా పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభమైంది. గ్రూప్‌- బీలోని ఆతిథ్య ఒమన్‌- పపువా న్యూగినియా మధ్య తొలి మ్యాచ్‌ మొదలుకానుంది. టాస్‌ గెలిచిన ఒమన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

మరిన్ని వార్తలు