T20 World Cup Pak Vs Afg: పాకిస్తాన్‌ ‘హ్యాట్రిక్‌’.. సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయం

30 Oct, 2021 07:36 IST|Sakshi

పాక్‌ ‘హ్యాట్రిక్‌’.. వరుసగా మూడో విజయం 

సాధించిన మాజీ చాంపియన్‌

అఫ్గానిస్తాన్‌పై ఐదు వికెట్లతో గెలుపు

ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఆసిఫ్‌ అలీ

Pakistan Beat Afghanistan By 5 Wickets Hat Trick Win: టీ20 వరల్డ్‌కప్‌-2021... అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌... ఆఖరి 2 ఓవర్లలో పాకిస్తాన్‌ విజయానికి 24 పరుగులు కావాలి. బౌలర్‌ ఎవరైనా ఇది అంత సులువు కాదు. పైగా అంతకుముందు ఓవర్లో 2 పరుగులే రావడంతో పాక్‌ బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. అఫ్గానిస్తాన్‌ జట్టు సంచలన విజయం సాధించడం ఖాయమనిపించింది. అయితే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆసిఫ్‌ అలీ (7 బంతుల్లో 25 నాటౌట్‌; 4 సిక్సర్లు) పాక్‌ రాత మార్చేశాడు.

కరీమ్‌ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 4 సిక్సర్లతో చెలరేగి జట్టును గెలిపించాడు. అతను వరుసగా 6, 0, 6, 0, 6, 6 పరుగులు సాధించాడు. దాంతో పాకిస్తాన్‌ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. వరుసగా మూడో విజయంతో పాక్‌కు సెమీస్‌ బెర్త్‌ దాదాపు ఖాయమైంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది.

గుల్బదిన్‌ నైబ్‌ (25 బంతుల్లో 35 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), నబీ (32 బంతుల్లో 35 నాటౌట్‌; 5 ఫోర్లు) రాణించారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 45 బంతుల్లో 71 పరుగులు జోడించారు. పాక్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 148 పరుగులు సాధించి గెలిచింది. ఇక పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (47 బం తుల్లో 51; 4 ఫోర్లు), ఫఖర్‌ జమాన్‌ (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.  

బాబర్‌ అర్ధసెంచరీ...
సాధారణ లక్ష్య ఛేదనలో పాక్‌ ఆరంభంలోనే రిజ్వాన్‌ (8) వికెట్‌ను కోల్పోయింది. అయితే బాబర్, ఫఖర్‌ కలిసి ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే తక్కువ వ్యవధిలో ఫఖర్‌తో పాటు హఫీజ్‌ (10) కూడా నిష్క్రమించాడు. బాబర్‌ను రషీద్‌ అవుట్‌ చేయడంతో  ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్‌ ఉల్‌ హఖ్‌ 2 పరుగులే ఇచ్చి మాలిక్‌ (19) వికెట్‌ తీయడంతో అఫ్గాన్‌ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ఆసిఫ్‌ తన మెరుపు బ్యాటింగ్‌తో పాక్‌ను గెలిపించాడు.

రషీద్‌ ఖాన్‌ ఘనత
అంతర్జాతీయ టి20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న నాలుగో బౌలర్‌ రషీద్‌ ఖాన్‌. గతంలో షకీబ్‌ (బంగ్లాదేశ్‌–117 వికెట్లు), మలింగ (శ్రీలంక–107), సౌతీ (న్యూజిలాండ్‌ –100) మాత్రమే ఈ ఘనత సాధించారు. 

స్కోరు వివరాలు  
అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: హజ్రతుల్లా (సి) రవూఫ్‌ (బి) ఇమాద్‌ 0; షహజాద్‌ (సి) బాబర్‌ (బి) అఫ్రిది 8; రహ్మానుల్లా (సి) బాబర్‌ (బి) హసన్‌ 10; అస్గర్‌ (సి అండ్‌ బి) రవూఫ్‌ 10; కరీమ్‌ (సి) ఫఖర్‌ (బి) ఇమాద్‌ 15; నజీబుల్లా (సి) రిజ్వాన్‌ (బి) షాదాబ్‌ 22; నబీ (నాటౌట్‌) 35; గుల్బదిన్‌ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 12, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 147.
వికెట్ల పతనం: 1–7, 2–13, 3–33, 4–39, 5–64, 6–76. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0– 22–1, ఇమాద్‌ 4–0–25–2, రవూఫ్‌ 4–0–37–1, హసన్‌ 4–1–38–1, షాదాబ్‌ 4–0–22–1.  

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (సి) నవీన్‌ (బి) ముజీబ్‌ 8; బాబర్‌ (బి) రషీద్‌ 51; ఫఖర్‌ (ఎల్బీ) (బి) నబీ 30; హఫీజ్‌ (సి) గుల్బదిన్‌ (బి) రషీద్‌ 10; షోయబ్‌ మాలిక్‌ (సి) షహజాద్‌ (బి) నవీన్‌ 19; ఆసిఫ్‌ అలీ (నాటౌట్‌) 25; షాదాబ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 5, మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1–12, 2–75, 3–97, 4–122, 5–124. 
బౌలింగ్‌: ముజీబ్‌ 4–0–14–1, నబీ 4–0–36–1, నవీన్‌ 3–0–22–1, కరీమ్‌ 4–0–48–0, రషీద్‌ 4–0–26–2.

చదవండి: Ishan Kishan: ఇషాన్‌ ఓపెనర్‌గా వస్తే దుమ్మురేపడం ఖాయం

మరిన్ని వార్తలు