T20 World Cup: రషీద్‌ ఖాన్‌ టాప్‌-5 టీ20 క్రికెటర్ల లిస్టు.. ఎవరెవరంటే!

12 Oct, 2021 11:23 IST|Sakshi

మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్‌కప్‌ మొదలుకానుంది. యూఏఈ, ఒమన్‌ వేదికగా జరుగనున్న పొట్టి ఫార్మాట్‌ మెగా టోర్నీకి సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో.. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు యూఏఈకి పయనమయ్యారు. ఇక క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించిన ప్రతీ వార్త ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌ లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ టీ20 ఫార్మాట్‌లో తనకు ఇష్టమైన ఐదుగురు ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు. ఇందులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు, ఒక న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ క్రికెటర్‌‌, దక్షిణాఫ్రికా స్టార్‌కు చోటిచ్చాడు. వారు ఎవరంటే!

విరాట్‌ కోహ్లి..
టీమిండియా కెప్టెన్‌, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు సారథిగా విరాట్‌ కోహ్లి పేరిట పలు రికార్డులు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో మొత్తంగా అతడు.. 10,136 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 3159 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో రషీద్‌ ఖాన్‌.. కోహ్లి గురించి మాట్లాడుతూ... ‘‘ఎలాంటి వికెట్‌పై అయినా ధీటుగా నిలబడి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరచగల ఆటగాడు’’అని అభివర్ణించాడు. 

కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌)
న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. టీ20 ఫార్మాట్‌లో 5429 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 125.08 స్ట్రైక్‌రేటుతో 1805 రన్స్‌ సాధించాడు. ఇక ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌ సహచర ఆటగాడైన రషీద్‌ ఖాన్‌... కివీస్‌ సారథి గురించి చెబుతూ తాను ప్రశాంతంగా ఉంటూ.. జట్టును కూడా కూల్‌గా ముందుకు నడిపిస్తాడని చెప్పుకొచ్చాడు.

ఏబీ డివిల్లియర్స్‌(దక్షిణాఫ్రికా)
సౌతాఫ్రికా స్టార్‌ ఏబీ డివిల్లియర్స్‌ను విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గా రషీద్‌ ఖాన్‌ అభివర్ణించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎదురుగా ఎలాంటి బౌలర్‌ ఉన్నా విరుచుకుపడటమే తనకు అలవాటు అని ప్రశంసలు కురిపించాడు. తనలాంటి బ్యాటర్‌ జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్‌ కోరుకుంటాడని కితాబిచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో మొత్తంగా 9424 పరుగులు చేసిన ఏబీడీ... అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1672 రన్స్‌ చేశాడు. ఐపీఎల్‌లో ఏబీ... ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

కీరన్‌ పొలార్డ్‌(వెస్టిండీస్‌)
విండీస్‌ కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌ను తన ఫేవరెట్‌ ఆటగాళ్లలో ఒకడిగా రషీద్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. తన జట్టులో ఆల్‌రౌండర్‌గా తనకు స్థానం కల్పిస్తానన్నాడు. కాగా టీ20 ఫార్మాట్‌లో మొత్తంగా... 11,236 పరుగులు చేసిన పొలార్డ్‌... అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 1378 పరుగులు చేశాడు. అంతేగాకుండా పొట్టి ఫార్మాట్‌లో ఓవరాల్‌గా 300 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు. 2012లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన విండీస్‌ జట్టులో సభ్యుడిగా, 2016లో జట్టును విన్నర్‌గా నిలిపిన కెప్టెన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. 

హార్దిక్‌ పాండ్యా(టీమిండియా)
మరో ఆల్‌రౌండర్‌గా భారత ఆటగాడు హార్దిక్‌ పాండ్యాను ఎంచుకున్నాడు రషీద్‌ ఖాన్‌. పొలార్డ్‌, పాండ్యా వలె బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించే వాళ్లు జట్టులో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. వారిద్దరు ఉన్నారంటే కెప్టెన్‌కు పని కాస్త సులువు అవుతుందని చెప్పుకొచ్చాడు. కాగా వీరిద్దరు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్‌ జట్టులో సభ్యులు అన్న సంగతి తెలిసిందే. ఇక హార్దిక్‌ పాండ్యా  పొట్టి ఫార్మాట్‌లో మొత్తంగా 2728 పరుగులు చేయగా... అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 484 రన్స్‌ సాధించాడు. 

చదవండి: T20 World Cup: పొలార్డ్‌ టాప్‌-5 ఫేవరెట్‌ లిస్టు.. ఆశ్చర్యకరంగా తను కూడా!

మరిన్ని వార్తలు