T20 World Cup 2021: రోహిత్‌ చెప్పడంతోనే ఆ ఆటగాడు ఎంపికయ్యాడు

11 Sep, 2021 21:16 IST|Sakshi

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం దక్కడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత నాలుగేళ్లుగా టెస్ట్‌లకు మాత్రమే పరిమితమైన అశ్విన్.. 2017 జూలైలో తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. అనంతరం యువ ఆటగాళ్లు సత్తాచాటడంతో అశ్విన్‌కు టీ20ల్లో అవకాశం దక్కలేదు. అయితే మెగా టోర్నీ ముందు మరో ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో అశ్విన్‌ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. అయితే అశ్విన్ రీఎంట్రీ విషయంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

జట్టు ఎంపిక ముంగిట కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలతో చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ వర్చువల్‌గా సమావేశమైంది. ఈ సమావేవంలో అశ్విన్ గురించి సెలెక్షన్ కమిటీ ప్రస్తావించగా.. రోహిత్ అన్నీ సానుకూల అంశాలే చెప్పాడని సమాచారం. అంతేకాకుండా అశ్విన్ రాకతో జట్టు బలం పెరుగుతుందని, యూఏఈ పిచ్‌లపై అతను కీలకం అవుతాడని రెకమెండ్‌ కూడా చేశాడట. కెప్టెన్ కోహ్లీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సెలెక్షన్ కమిటీ అశ్విన్‌ను ఎంపిక చేసిందని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపాడు. చేతి వేలి గాయంతో సుందర్ టీ20 ప్రపంచకప్‌కు దూరమవడం కూడా అశ్విన్‌కు కలిసొచ్చిందని సదరు అధికారి పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇచ్చేందుకు బీసీసీఐ ఆసక్తికనబరుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే టీ20 ప్రపంచకప్ జట్టు ఎంపికలో రోహిత్ శర్మ సలహాలు, సూచనలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలుస్తోంది. శిఖర్ ధవన్, సంజూ సామ్సన్, యుజ్వేంద్ర చహల్‌లను కాదని ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, సూర్యకుమార్ యాదవ్‌ల ఎంపిక ఇందులో భాగంగానే జరిగిందన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. కాగా, మెగాటోర్నీ కోసం భారత సెలెక్షన్ కమిటీ గత బుధవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. 
చదవండి: ఆవేశంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు.. ఐపీఎల్‌ బహిష్కరిస్తామని బెదిరింపులు..!

మరిన్ని వార్తలు