T20 World Cup 2021: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో నెదర్లాండ్స్‌ అత్యంత చెత్త రికార్డు

22 Oct, 2021 21:14 IST|Sakshi

Sri Lanka Skittles Netherlands To Second Lowest Total In T20WC History: పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో నెదర్లాండ్స్‌ జట్టు అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టీ20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ గ్రూప్‌-ఏలో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులకే ఆలౌటై, టోర్నీ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. టోర్నీ చరిత్రలో అత్యల్ప స్కోర్‌ రికార్డు సైతం నెదర్లాండ్స్‌ పేరిటే నమోదై ఉంది. 2014 ప్రపంచకప్‌లో ఇదే శ్రీలంక జట్టుపై కేవలం 39 పరుగులకే ఆలౌటైన నెదర్లాండ్స్‌.. టోర్నీ చరిత్రలో మొదటి రెండు అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది.  

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. పసికూన నెదర్లాండ్స్‌పై ప్రతాపాన్ని చూపింది. స్పిన్నర్లు వనిందు హసరంగ(3/9), మహీశ్‌ తీక్షణ(2/3), పేసర్లు లహీరు కుమార(3/7), దుశ్మంత చమీరా(1/13) చెలరేగి బౌల్‌ చేయడంతో నెదర్లాండ్స్‌ చిగురుటాకులా వణిపోయింది. కేవలం 10 ఓవర్లు మాత్రమే ఆడి 44 పరగులకే ఆలౌటైంది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో కొలిన్‌ ఆకెర్‌మెన్‌(11) మినహా ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్‌ చేయలేకపోయారు. నెదర్లాండ్స్‌ స్కోర్‌లో 6 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. కాగా, గ్రూప్‌-ఏ నుంచి శ్రీలంక ఇదివరకే సూపర్‌ 12 బెర్త్‌ ఖరారు చేసుకోగా.. నెదర్లాండ్స్‌ ఈ మ్యాచ్‌ జయాపజయాలతో సంబంధం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.  
చదవండి: కరోనా కారణంగా రద్దైన 'ఆ' టెస్ట్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ఖరారు

మరిన్ని వార్తలు