T20 World Cup 2021 SA Vs WI: మరోసారి విండీస్‌ విలవిల.. టోర్నీ నుంచి అవుట్‌ అయ్యే ప్రమాదం

27 Oct, 2021 07:50 IST|Sakshi

దక్షిణాఫ్రికా చేతిలో 8 వికెట్లతో చిత్తు

టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో డిఫెండింగ్‌ చాంపియన్‌

సఫారీ జట్టును గెలిపించిన బౌలర్లు

T20 World Cup 2021: రెండుసార్లు టి20 ప్రపంచకప్‌ విశ్వవిజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌ ఈసారి మెగా టోర్నీలో అందరికంటే ముందే నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో 55కే కుప్పకూలిన విండీస్‌ ఈసారి అంతకంటే మెరుగ్గా ఆడినా అదీ ఓటమి నుంచి తప్పించలేకపోయింది.

వరుసగా రెండు ఓటముల తర్వాత పేలవ రన్‌రేట్‌తో నిలిచిన పొలార్డ్‌ బృందం ముందుకెళ్లాలంటే అద్భుతాలు జరగాలి. మరోవైపు గత ఓటమి నుంచి పాఠం నేర్చుకున్న దక్షిణాఫ్రికా పదునైన ఆటతో ప్రత్యరి్థని పడగొట్టి కీలక పాయింట్లు తమ ఖాతాలో వేసుకుంది. నోర్జే, ప్రిటోరియస్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో మార్క్‌రమ్‌ మెరుపులు సఫారీలను గెలిపించాయి.

South Africa Beat West Indies By 8 Wickets: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాకు తొలి విజయం దక్కింది. దుబాయ్‌లో మంగళవారం జరిగిన గ్రూప్‌–1 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా విండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ఎవిన్‌ లూయిస్‌ (35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా...‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నోర్జే (1/14), ప్రిటోరియస్‌ (3/17) ప్రత్యర్థిని దెబ్బ తీశారు.

అనంతరం దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 144 పరుగులు చేసి గెలిచింది. మార్క్‌రమ్‌ (26 బంతుల్లో 51 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), వాన్‌ డర్‌ డసెన్‌ (51 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు), రీజా హెన్‌డ్రిక్స్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.  

గేల్‌ విఫలం... 
ఓపెనర్‌ లూయిస్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోగా... మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో విండీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ముఖ్యంగా రెండో ఓపెనర్‌ లెండిల్‌ సిమన్స్‌ (35 బంతుల్లో 16;) అనూహ్యంగా బంతులను వృథా చేయడం కూడా జట్టును దెబ్బ తీసింది. ఒక ఎండ్‌లో లూయిస్‌ మెరుపు బ్యాటింగ్‌తో తొలి వికెట్‌కు 73 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ నమోదైనా, ఇందులో లూయిస్‌ ఒక్కడే 56 పరుగులు సాధించాడు.

రబడ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టిన అతను... మార్క్‌రమ్‌ ఓవర్లో వరుస బంతుల్లో 6, 6, 4 బాదాడు. షమ్సీ బౌలింగ్‌లో కొట్టిన మరో భారీ సిక్స్‌తో 32 బంతుల్లోనే లూయిస్‌ అర్ధసెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు మహరాజ్‌ బౌలింగ్‌లో లూయిస్‌ వెనుదిరగడంతో తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది.

పూరన్‌ (12) విఫలం కాగా, తన 75 మ్యాచ్‌ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎన్నడూ మూడో స్థానంకంటే దిగువన ఆడని క్రిస్‌ గేల్‌ (12) ఈ మ్యాచ్‌లోనే తొలిసారి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ దిగి ప్రభావం చూపలేకపోయాడు. ఆ తర్వాత విండీస్‌ బ్యాటింగ్‌ పూర్తిగా తడబడింది. చివర్లో పొలార్డ్‌ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఆఖరి 3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయిన విండీస్‌ 22 పరుగులే జోడించింది.  

కీలక భాగస్వామ్యాలు... 
సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా రనౌట్‌ రూపంలో కెప్టెన్‌ బవుమా (2) వికెట్‌ కోల్పోయింది. అయితే ఆ తర్వాతి రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు సఫారీలను గెలిపించాయి. ముందుగా హెన్‌డ్రిక్స్, డసెన్‌ కలిసి రెండో వికెట్‌కు 57 పరుగులు (50 బంతుల్లో) జోడించారు. ఎక్కడా తొందరపాటు ప్రదర్శించకుండా వీరిద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు.

హెట్‌మైర్‌ అద్భుత క్యాచ్‌తో హెన్‌డ్రిక్స్‌ ఆట ముగిసినా ...ఆ తర్వాత వచ్చిన మార్క్‌రమ్‌ చూడచక్కటి షాట్లతో దూసుకుపోయాడు. 4 భారీ సిక్సర్లు సహా 25 బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన అతను, తర్వాతి బంతికే సింగిల్‌తో మ్యాచ్‌ను ముగించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 83 పరుగులు (54 బంతుల్లో) జత చేశారు.

స్కోరు వివరాలు
వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ (బి) రబడ 16; లూయిస్‌ (సి) రబడ (బి) మహరాజ్‌ 56; పూరన్‌ (సి) మిల్లర్‌ (బి) మహరాజ్‌ 12; గేల్‌ (సి) క్లాసెన్‌ (బి) ప్రిటోరియస్‌ 12; పొలార్డ్‌ (సి) డసెన్‌ (బి) ప్రిటోరియస్‌ 26; రసెల్‌ (బి) నోర్జే 5; హైట్‌మైర్‌ (రనౌట్‌) 1; బ్రావో (నాటౌట్‌) 8; వాల్‌‡్ష (సి) హెన్‌డ్రిక్స్‌ (బి) ప్రిటోరియస్‌ 0; హొసీన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7,
మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 143. 
వికెట్ల పతనం: 1–73, 2–87, 3–89, 4–121, 5–132, 6–133, 7–137, 8–137. బౌలింగ్‌: మార్క్‌రమ్‌ 3–1–22–0, రబడ 4–0–27–1, నోర్జే 4–0–14–1, మహరాజ్‌ 4–0–24–2, షమ్సీ 3–0–37–0, ప్రిటోరియస్‌ 2–0–17–3.  

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: బవుమా (రనౌట్‌) 2; హెన్‌డ్రిక్స్‌ (సి) హెట్‌మైర్‌ (బి) హొసీన్‌ 39; వాన్‌ డర్‌ డసెన్‌ (నాటౌట్‌) 43; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 51; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 144.  
వికెట్ల పతనం: 1–4, 2–61. బౌలింగ్‌: హొసీన్‌ 4–0–27–1, రవి రాంపాల్‌ 3–0–22–0, రసెల్‌ 3.2–0–36–0, హేడెన్‌ వాల్‌‡్ష 3–0–26–0, బ్రావో 4–0–23–0, పొలార్డ్‌ 1–0–9–0. 

చదవండి: T20 WC 2021: వారెవ్వా హసన్‌ అలీ.. అయ్యో విలియమ్సన్‌
T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్‌ దారిలో పాక్‌ ..

మరిన్ని వార్తలు