Trolls On Shaheen Afridi: బిల్డప్‌ ఎక్కడికి పోయింది బాస్‌!

12 Nov, 2021 14:01 IST|Sakshi

దుబాయ్‌:  ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాతో మ్యాచ్‌ తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలిచింది షాహిన్‌ అఫ్రిది. భారత్‌ను ఆదిలోనే కోలుకోలేని దెబ్బకొట్టడంతో షాహిన్‌ ఒ‍క్కసారిగా హీరో అయిపోయాడు. ఎక్కడ చూసినా షాహిన్‌.. షాహిన్‌. ఇది హోరు. మ్యాచ్‌ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు కూడా షాహిన్‌ అఫ్రిది ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడ్డారు. మనోడు కూడా ఎక్కడా తగ్గేది లే అన్నట్లు వరుసగా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చుకుంటూ పోయాడు.

అది చూసిన భారత ఫ్యాన్స్‌ బిల్డప్‌ కాస్త ఎక్కువైందనే చమత్కరించుకున్నారు. ఇప్పుడు ఆ బిల్డప్‌ ఎక్కడికో పోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు కావాలా షాహిన్‌ ఆటోగ్రాఫ్‌లు అంటూ జోక్స్‌ వేస్తున్నారు.  ఇందుకు కారణం ఆసీస్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచే. అది కూడా కేవలం ఒక్క ఓవర్‌తోనే అప్పటివరకూ హీరోగా నిలిచిన షాహిన్‌.. విలన్‌ అయిపోయాడు. పొగిడిన నోళ్లే.. ఏమి బౌలింగ్‌ అంటూ నోరు పారేసుకున్నారు.  హీరోగారి బిల్డప్‌ ఎక్కడికి పోయిందంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు  వేస్తున్నారు. 

టీమిండియాతో జరిగిన  మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన షాహిన్‌.. 31 పరుగులిచ్చి 3 మూడు వికెట్లు తీశాడు. అవి కూడా రోహిత్‌, రాహుల్‌,  కోహ్లిలు వికెట్లు కావడంతో షాహిన్‌ పేరు మార్మోగిపోయింది. మరి ఆసీస్‌తో మ్యాచ్‌లో షాహిన్‌ బౌలింగ్‌ గణాంకాలు బాగానే ఉన్నాయి. నాలుగు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చిన వికెట్‌ మాత్రమే తీశాడు. తన ఆఖరి ఓవర్‌(మ్యాచ్‌కు చివరి ఓవర్‌) ముందు వరకూ 13 పరుగులే ఇచ్చాడు షాహిన్‌. ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్‌ మాథ్యూవేడ్‌..షాహిన్‌ వేసిన ఆఖరి ఓవర్‌ మూడో బంతికి బతికి బయటపడటంతో ఆపై మ్యాచ్‌ స్వరూపమే మారింది.

క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అంటే ఏమిటో మరొకసారి నిజం చేశాడు వేడ్‌.  ఆసీస్‌కు ఫైనల్‌ చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయిన తరుణంలో వేడ్‌ వరుసగా కొట్టిన సిక్స్‌లు మ్యాచ్‌ స్థితిని మొత్తం మార్చేశాయి. షాహిన్‌ వేయడం వేడ్‌ సిక్సర్ల మోత మోగించడం చకచకా జరిగిపోయాయి. అసలు ఏమౌతుందో తెలుసుకునే లోపే మ్యాచ్‌ ముగిసి కంగారులు ఫైనల్‌లో అడుగుపెట్టడం ఖాయం కాగా, పాక్‌ ఆటగాళ్లు తలపై చేతులు పెట్టుకుని గ్రౌండ్‌లో కూలబడిపోయారు. పాకిస్తాన్‌ను సెమీ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన అఫ్రిదిని సెమీస్‌ తర్వాత ఏమనాలో ఆ జట్టుకు అంతుబట్టలేదు. అభిమానులు మాత్రం షాహిన్‌ను ఆడేసుకుంటున్నారు. ఏం బాస్‌.. మొత్తం మీద సెమీస్‌కు చేరడానికి, సెమీస్‌ నుంచి వైదొలగడానికి కారణం అయ్యావ్‌.. ఏం చేస్తాం.. టైమ్‌ బాలేనట్లు ఉంది.. నెక్స్‌టైమ్‌ బెటర్‌ లక్‌ అంటూ ఆటపట్టిస్తున్నారు. 
చదవండి: T20 World Cup 2021: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా

మరిన్ని వార్తలు